నవ్వుతో జయించు.. చీకటిని ఎదురించు!

16 Sep, 2017 23:22 IST|Sakshi
నవ్వుతో జయించు.. చీకటిని ఎదురించు!

- వరకట్న దాహానికి తల్లి బలి
- తెలిసీ చేసిన నేరానికి కటకటాల్లో తండ్రి
- పది నెలల చిన్నారి భవిష్యత్‌ అంధకారం
- అమ్మ లేదని.. తిరిగి రాదని తెలియని పసితనం
- బలవన్మరణాలను ప్రశ్నిస్తున్న నవ్వుల పువ్వు
- ఈ చిన్నారిని పయనం ఎటువైపు?


ఈ బోసినవ్వుల వెనుక విషాదం దాగుంది. వచ్చీ రాని అమ్మ పలుకులు.. కనిపించని లోకాలకు వినిపించవని తెలియదు పాపం. రెండు రోజుల క్రితం వరకు ఉదయం లేవగానే పాలు పట్టే ఆ రూపం ఇక కనిపించదనే చేదు నిజం ఈ నవ్వులకేం తెలుసు? లాల పోసి జోల పాడే తల్లిని తలుచుకుని మౌనంగా అందరి ముఖాల్లోకి చూడటం తప్ప ఈ చిన్నారి ఏం చేయగలదు? నవ మాసాలు మోసి కని పెంచుతున్న మాతృమూర్తి తీసుకున్న నిర్ణయం తన బంగారు భవితను అంధకారం చేసిన విషాదం ఎవరితో చెప్పుకోగలదు! ఆడ పుట్టుక ఇంత వేదనాభరితమని తెలియక.. ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆడ..పిల్ల పయనం ఎటువైపునకు. అమ్మానాన్న చదువుకున్నారని.. తన జీవితంలో అక్షర సుమం విరబూస్తుందనే ఈ చిన్నారి కల చెదిరిపోయింది. నాన్న అదనపు కట్న దాహం.. అమ్మ క్షణికావేశం.. పది నెలల బంగారు తల్లి జీవితం చుక్కాని లేని నావలా మారింది. అమ్మలారా.. అక్కలారా ఆలోచించండి. కష్టాలతో కుంగిపోకండి. ఎదురొడ్డి పోరాడండి. ఆడది అబల కాదు.. సబల అని చాటండి. కఠిన నిర్ణయం తీసుకునే ముందు.. ఈ లోకంతో పని ఏముందనుకునే క్షణం ఒక్కసారి పేగు పంచుకున్న పిల్లల ముఖం చూడండి. ఆ నవ్వుల పువ్వులకు సమాధానం చెప్పి మరీ కదలండి. అన్నింటికీ చావు పరిష్కారం కాదనే విషయం తెలిసి మసులుకోండి. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటరే.. పోయేటప్పుడు ఒక్కరే.. ఇదే జీవితం.

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని వినాయక్‌నగర్‌లో గత శుక్రవారం అదనపు కట్నం వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన రాజేశ్వరి కుమార్తె(10 నెలలు) జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తల్లి మృతదేహానికి శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తుండగా.. ఆ ప్రాంతంలో బంధువుల ఒడిలోని ఈ చిన్నారిని చూసిన హృదయాలు ద్రవించుకుపోయాయి. రోడ్లు భవనాల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న శ్రీనాథ్‌ ధన దాహం తన రక్తం పంచుకుని పుట్టిన చిన్నారిని మాతృ ప్రేమకు దూరం చేసింది. కుమార్తె జీవితం బాగుండాలని తాహతుకు మించి కట్నకానుకలతో మెట్టినింటికి పంపిన తల్లిదండ్రుల ఆశలపై బండ పడింది. పోస్టుమార్టం గది వద్ద ఈ వృద్ధ దంపతుల రోదన మిన్నంటింది. రాజేశ్వరి తండ్రి చంద్రశేఖర్‌ కన్నీటి పర్యంతమవుతూ.. ‘ఒక్కగానొక్క కూతురు.. ఆమె జీవితం బాగుండాలని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి కట్టబెట్టినా.

25 తులాల బంగారం, రూ.3లక్షల నగదుతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశాం. ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచీ నరకమే. అదనపు కట్నం కోసం బతికుండగానే నరకం చూపించినారు. బుధవారం నాడు ఫోన్‌ చేసి రా.. నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గురువారం వెళ్లి అందరికీ సర్దిచెప్పినాం. శుక్రవారం రోజున మళ్లీ అదే గొడవ. ఎంతటి క్షోభకు గురి చేసినారో. ఈ లోకం వీడిచిపెట్టి పోయింది. నా తల్లి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఇది హత్యే. నా బిడ్డ పరిస్థితి మరొకరికి రాకూడదు. వాళ్లందర్నీ కఠినంగా శిక్షించాలి.’ అన్నారు. ఇదిలాఉంటే వన్‌టౌన్‌ పోలీసుల అదుపులోని రాజేశ్వరి భర్త శ్రీనాథ్‌ బోరున విలపించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. చిన్న మనస్పర్థలకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని వాపోయాడు. పోస్టుమార్టం అనంతరం రాజేశ్వరి అంత్యక్రియలు నగరంలో జేఎన్‌టియూ రోడ్డులోని శ్మశానవాటికలో పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు