కన్నుల పండువగా ఫ్లీట్

5 Feb, 2016 07:53 IST|Sakshi
కన్నుల పండువగా ఫ్లీట్

అమరవీరులకు నివాళులతో శ్రీకారం
ఐఎఫ్‌ఆర్ ఎగ్జిబిషన్, విలేజ్ ప్రారంభం
బీచ్‌రోడ్డులో ఆకట్టుకున్న ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ ముగింపు
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి: ఏపీ సీఎం

 
‘యునెటైడ్‌త్రూ ఓషన్స్’ అనే థీమ్‌సాంగ్ మార్మోగుతుండగా.. కళ్లు చెదిరే కవాతు, కార్నివాల్‌ల నడుమ విశాఖ బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్ - 2016) గురువారం కన్నుల పండువగా ప్రారంభమైంది.

దేశం కోసం అసువులు బాసిన అమరవీరులకు ‘విక్టరీ ఎట్ సీ’ స్మారక స్తూపం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు, భారత నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్, తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ నివాళులర్పించారు. బీచ్‌రోడ్డులో ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ ముగింపు కార్యక్రమంలో నావికా దళం విన్యాసాలను అశేష జనం ఆసక్తిగా తిలకించారు.
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘యునెటైడ్‌త్రూ ఓషన్స్’ అనే థీమ్‌సాంగ్ మార్మోగుతుండగా.. కళ్లు చెదిరే కవాతు, కార్నివాల్‌ల నడుమ విశాఖ బీచ్‌రోడ్డులో అం తర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్ - 2016) గురువారం కన్నుల పండువగా ప్రారంభమైంది. మొదట దేశం కోసం అసువులు బాసిన అమరవీరులకు ‘విక్టరీ ఎట్ సీ’ స్మారక స్తూపం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు, భారత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్, తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ నివాళులు అర్పించారు. అనంతరం ఐఎఫ్‌ఆర్ విలేజ్, ఐఎఫ్‌ఆర్ ఎగ్జిబిషన్లు ప్రారంభించారు. అనంత రం బీచ్‌రోడ్డులో ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి సన్నద్ధత సమీక్షించారు. అశేష జనం హాజరై నౌకాదళ విన్యాసాలను తిలకించారు.
 
అమరవీరులకు ఘన నివాళి
ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ గురువారం సాయంత్రం 4.30గంటలకు బీచ్‌రోడ్డులోని అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకున్నా రు. నేవీ బ్యాండ్ మోగుతుండగా... సైనికులు ముందు నడుస్తుండగా పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

రెండు నిముషాలు మౌనం పాటించారు. వివిధ దేశాల నౌకాదళాల ప్రతినిధులతోపాటు ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపీలు  కె.హరిబాబు, ఎం.శ్రీనివాసరావు, డీజీపీ రాముడు, కలెక్టర్ యువరాజ్, పోలీస్‌కమిషనర్ అమిత్‌గార్గ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి

‘మేకిన్ ఇండియా’ నినాదం స్ఫూర్తితో రక్షణ ఉత్పత్తుల రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్, మారిటైమ్ ఎగ్జిబిషన్‌లను నౌకాదళాధిపతి ఆర్కే ధోవన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధనౌకలతోపాటు దేశ రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులను మనమే రూపొందించుకునే దిశగా కృషి చేయాలన్నారు.
 
ఐఎఫ్‌ఆర్ నిర్వహణతో దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందన్నారు. దేశ వృద్ధి రేటు 8 శాతానికి చేరుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన చెప్పారు. ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చంద్రబాబు, ఆర్కే ధోవన్, సతీష్ సోనీ సందర్శించారు. నౌకాదళ పాటవాన్ని తెలియజేసే వీడియో ప్రదర్శనను తిలకించారు.
 
ఆకట్టుకున్న తుది రిహార్సల్స్
బీచ్‌రోడ్డులో గురువారం రాత్రి నిర్వహించిన ఐఎఫ్‌ఆర్ తుది రిహార్సల్స్ వీక్షకులను ఆకట్టుకున్నాయి. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరచాయి. మెరైన్ కమెండోలు, మార్కోవ్స్ సాహసోపేతమైన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
 
భారత నౌకాదళంతోపాటు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాల నౌకాదళ సిబ్బంది బీచ్‌రోడ్డులో కవాతు నిర్వహించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్‌కు గౌరవ వందనం సమర్పించారు. చివరగా ఆకాశంలో బాణాసంచా మెరుపులతో రిహార్సల్స్ ముగిశాయి. సతీష్ సోనీతోపాటు పలువురు నౌకాదళ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
‘మేకిన్ ఇండియా’నుప్రతిఫలించిన ఐఎఫ్‌ఆర్ విలేజ్
మేకిన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిఫలించేలా ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్‌లో మొత్తం 74 స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు, పశ్చిమ నౌకాదళ విభాగాలతోపాటు బ్రహ్మోస్, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, హెచ్‌ఏఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ ఉత్పత్తుల రంగానికి చెందిన పలు ప్రైవేటు సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
 
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాల హస్తకళలను ప్రదర్శిస్తూ 102 స్టాల్స్‌ను, వివిధ ప్రాంతాల వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు