వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి కృషి

3 Oct, 2016 22:55 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి కృషి
– పార్టీ స్థానిక సంస్థల విభాగం రాష్ట్ర కన్వీనర్‌ వేమారెడ్డి
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వైఎస్‌ఆర్‌సీపీ స్థానిక సంస్థల విభాగం బలోపేతానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు పర్యటించి పార్టీ స్థానిక సంస్థల విభాగానికి కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సమక్షంలో పెద్దకడబూరు ఎంపీపీ డి.రఘురాములు అధ్యక్షుడుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆదోని జెడ్పీటీసీ సభ్యుడు జి.ఆనంద్, ఎమ్మిగనూరు కౌన్సిలర్‌ రిజ్వానా బేగం, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు హెచ్‌.నాగరాజు, పెద్దకడబూరు సర్పంచ్‌ షేర్‌ఖాన్‌ పటేల్‌లను రాష్ట్ర కమిటీకి ప్రతిపాదించామన్నారు. జిల్లా నుంచి ఈ నలుగురు రాష్ట్ర స్థానిక సంస్థలకు ప్రతినిధులుగా ఉంటారని తెలిపారు. ఈ విభాగం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోల్పోయిన అధికారాల కోసం పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బళ్లా శ్రీనివాస్‌ బాబు, తాడేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆర్‌.ఆదం, డైరెక్టర్‌ పరంధామం, జిల్లా గొర్రెల సంఘం మాజీ ఛైర్మన్, సర్పంచ్‌ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
 
భయం వల్లనే కార్పొరేషన్‌ ఎన్నికలు వాయిదా : గౌరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు
ఓటమి భయంతోనే టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ ఎన్నికల తేదీని ప్రకటించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. కేసుకు భయపడే కేంద్ర ముందు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు.
 
ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటమే: కాటసాని రామిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి నాటకమాడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ మంత్రుల జేబులు నింపుకోడానికే సరిపోతుంది. దాని వల్ల ప్రజలకు ప్రయోజనం ఒనగూడదు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివద్ధి సాధ్యమవుతుంది. సాధించే వరకు వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం ఆగదు.
 
మరిన్ని వార్తలు