నాపరాతి గనిలో కార్మికుడి దుర్మరణం

20 Dec, 2016 21:59 IST|Sakshi
నాపరాతి గనిలో కార్మికుడి దుర్మరణం
కొలిమిగుండ్ల:  రాఘవరాజుపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యనున్న నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. కనకాద్రిపల్లెకు  చెందిన మేకల లింగారెడ్డి (55) రోజు మాదిరిగానే అంకిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి నాపరాతి గనిలో కూలీ పనికి వెళ్లాడు. కోత కోసిన రాయిన నడిపిస్తున్న తరుణంలో వంద అడుగుల పైనుంచి బండ రాయి నేరుగా తలపై పడింది. తోటి కార్మికులు చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచాడు. లింగారెడ్డి గనిలో పని చేస్తుండగా... భార్య పార్వతి పాలీష్‌ ఫ్యాక్టరీలో పని చేస్తుండేది. ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం జరిపించారు. మరి కొద్ది సేపట్లో పని ముగించుకొని ఇంటికి చేరాల్సిన కార్మికుడు రెప్పపాటులో అనంత లోకాలకు చేరాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కొద్ది రోజుల నుంచి నాపరాతి గనుల్లో కోతులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే గని పైభాగంలో సంచరించే సమయంలో రాయి కిందకు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సహ కార్మికులు పేర్కొన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంటే తరచూ టపాసులు పేల్చాలని ఎస్‌ఐ యజమానులకు సూచించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.    
 
మరిన్ని వార్తలు