చీకటి పనులు

20 Feb, 2017 00:29 IST|Sakshi
రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ పరిధిలోని గుడ్డగుర్కి సమీపంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి పొలంలో ఐదు రోజుల క్రితం జేసీబీతో తీసిన ఫారంపాండ్‌ ఇది. వాస్తవానికి ఇక్కడ సేద్యపు కుంట తీయకుండానే బిల్లులు స్వాహా చేశారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో           హడావుడిగా ఫారంపాండ్‌ తవ్వారు. 

అనంతపురం టౌన్‌ / రొళ్ల : పరిగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్‌ పథకం ఉద్దేశ్యం. అవసరం లేకపోయి నా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. పనులు చేయకుండా బిల్లులు చేసుకోవడం.. ఇదీ టీడీపీ నేతల తీరు. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ పరిధిలో కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో దడ మొదలైంది. ప్రాజెక్టు పరిధిలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీలో ఏడున్నరేళ్లలో రూ.11 కోట్ల విలువైన పనులు జరిగితే కేవలం 2016లో మాత్రమే రూ.5.88 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపారు.

ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాం లు, పాత చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో ‘ఫోర్డ్‌’ స్వచ్ఛంద సం స్థ ప్రతినిధులు దోచుకున్నారు. ఆయా పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పొలాలు, గ్రామాల్లోని వంకల్లో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. సా మాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసినా కేవలం రూ.79 లక్షలు మాత్రమే అవినీతి జరిగిందని తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ జరిగిన అక్రమాలపై 10వ తేదీన అవి‘నీటి’ ప్రవాహం.. 11న గుంతగుంతలో గూడుపుఠానీ.. 12న పైపై పూత నిధుల మేత... 18వ తేదీన ‘సమయం లేదు ‘తమ్ముడూ’.. దొరికినంత దోచుడు’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు కలకలం సృష్టిం చాయి.

వాటర్‌షెడ్‌ కమిటీ ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు చేపట్టడం.. అసలు పనులే చేయకుం డా బిల్లులు చేసుకున్న విషయాన్ని  ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫోర్డ్‌ ప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే క్షేత్రస్థాయిలో పనులు లేని విష యం తెలిసిపోతుందని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. దీంతో వారం రోజులుగా ఫారంపాండ్స్, చెక్‌డ్యాం ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పోనీ వీటిని నాణ్యత గా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్నాయంటే.. ఉన్నాయన్నట్టు కడుతున్నారు.

పైగా ఇక్కడ జరిగిన పనులకు సం బంధించి ఎం–బుక్కులు, ఇతరత్రా రికార్డులు స్వాధీనం చేసుకోవడంలో డ్వామా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్ట్‌ కార్యాలయంలో వాటర్‌షెడ్‌ అసిస్టెంట్లు రికార్డులన్నీ సరి చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ పనులు చేసినట్లు బిల్లులు తీసుకున్నారో చూసి వాటి వివరాలను తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో వారు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రత్నగిరి పంచాయతీలోని అలుపనపల్లికి చెందిన టీడీపీ నాయకులు మూడ్రోజులుగా ఆరు చెక్‌డ్యాం నిర్మాణాలను రాత్రి వేళ చేపడుతున్నారు. కాకి పంచాయతీలోని ఓ నాయకుడు సైతం రెండు చెక్‌డ్యాంలు, మూడు ఫారంపాండ్లను తవ్విస్తున్నారు.  
మరిన్ని వార్తలు