ఘోరం..

6 Feb, 2017 23:43 IST|Sakshi
ఘోరం..
 •  ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
 • గుంతకల్లుకు చెందిన ఇద్దరు దుర్మరణం
 • నలుగురికి గాయాలు.. వారిలో ఒకరి పరిస్థితి విషమం
 • నల్లబోయినపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన
 •  
  బత్తలపల్లి (ధర్మవరం ) : 
  బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపాన అనంతపురం – కదిరి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... సోమవారం సాయంత్రం గుంతకల్లు పట్టణానికి చెందిన నాగరాజు (40), మస్తాన్‌ఖాన్‌(43), బోయ శ్రీనివాసులు మదనపల్లి నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే డ్రైవింగ్‌ చేస్తున్న నాగరాజు కంటిమీద రెప్పవాల్చాడు. స్టీరింగ్‌పై పట్టుతప్పింది. ఎదురుగా అనంతపురం నుంచి తిరుపతి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సు డ్రైవర్‌ గమనించి తాను మరింత రోడ్డుపక్కగా వచ్చాడు. అయినా వేగంగా వచ్చి బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ నాగరాజు ఎగిరి కిందపడి ప్రాణం విడిచాడు. పక్కనే కూర్చున్న మస్తాన్‌ఖాన్‌ కూడా తీవ్రంగా గాయపడి సీటులోనే మృతి చెందాడు. వెనుక సీటులో కూర్చున్న బోయ శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్సులో 51 మంది ప్రయాణికులుండగా వారిలో మొలకలవేముల మండలం ఓలేటివారిపల్లికి చెందిన లలితమ్మ, మహబూబ్‌బాషా, మహమ్మద్‌ స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో మరికొందరు స్వల్పంగా గాయపడినా వారు మరో బస్సులో వెళ్లిపోయారు. గాయపడిన వారిలో బోయ శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉంది. ముదిగుబ్బ, బత్తలపల్లికి చెందిన 108 వాహనాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో  చికిత్స చేయించారు. ధర్మవరం రూరల్‌ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
   
   
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా