గ్రానైట్‌

29 Jul, 2016 22:50 IST|Sakshi
గ్రానైట్‌
 •  వెలుగులు చిమ్మిన చోటే చీకటి
 • ముప్పేట దాడులతో  మూతపడ్డ పరిశ్రమలు
 • ఉపాధి కోల్పోయిన 30 వేల కుటుంబాలు
 • 30 ఏళ్లగా అవినీతిని  పోషిస్తున్న అధికారులు
 • తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమలు విస్తారంగా ఏర్పాటు కావడంతో అది వ్యాపారుల మధ్య పోటీకి దారితీసింది. ఈ క్రమంలో వ్యాపారం వక్రమార్గంలోకి మళ్లింది. ముడి సరుకు కోసం పొరుగు జిల్లాలపై ఆధారపడ్డ వ్యాపారులు జీరో వ్యాపారానికి తెరలేపారు. క్వారీల్లో రాయల్టీ చెల్లించకుండా సగం ధరకే ముడి సరుకు దిగుమతి చేసుకునేవారు. 30 టన్నుల రెడ్‌ గ్రానైట్‌ రాయి కోసం రాయల్టీ చెల్లిస్తే రూ. 70 వేలు అవుతుంది. అదే బిల్లులు లేకుండా అయితే రూ. 35 వేలకే సరుకు పరిశ్రమకు చేరుకుంటోంది.


  అవినీతిలో అధికారుల పాత్రే కీలకం
  గ్రానైట్‌ పరిశ్రమ యజమానుల జీరో వ్యాపారంలో విజిలెన్స్, వాణిజ్య, ఆదాయ పన్నుల, గనుల శాఖకు చెందిన కొందరు అవినీతి అధికారుల పాత్ర కీలకంగా ఉంది. అక్రమార్జన కోసం అధికారులు అవినీతిని పోషిస్తూ వచ్చారు. తాడిపత్రిలో గ్రానైట్‌ పరిశ్రమలు 400 దాకా ఉంటే ఇందులో 200 పరిశ్రమలకు ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌ లేకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. నల్లబండల పరిశ్రమలు దాదాపు 500 వరకు ఉంటే ఇందులోనూ 300 వాటికి ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌ లేన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాలుగా తాడిపత్రిలో గ్రానైట్‌ జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. నెల మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇందుకు పూర్తిగా సహకరించారన్న ఆరోపణలున్నాయి.  


  కథ అడ్డం తిరగడంతో దాడులు
  తాడిపత్రిలోని గ్రానైట్‌ పరిశ్రమలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులు నెలసరి రూ. 5 కోట్లు మేర వస్తుండడంతో గుర్తించిన విజిలెన్స్‌ డైరెక్టర్‌ నేరుగా రంగంలో దిగారు. పెద్ద ఎత్తున వినియోగం జరుగుతున్నా ప్రభుత్వ ఖజానాకు ఆ మేరకు ఆదాయం జమా కాకపోవడంతో దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ముడిసరుకు తరలింపులో ప్రభుత్వానికి రాయల్టీ, ఆదాయ, వాణిజ్య పన్నులు చెల్లించడం లేదని గుర్తించారు. ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌ లేనివి, జీరో వ్యాపారం సాగిస్తున్న పరిశ్రమల యాజమాన్యాల వైఖరి వల్ల ఖజానాకు రూ. కోట్లలో నష్టం వాటిల్లుతున్నట్లు ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఆయన అందజేశారు.  దీని ఆధారంగా తాడిపత్రిలో ప్రవేశించే నాలుగు మార్గాల్లోనూ వాణిజ్య, గనుల శాఖలు సంయుక్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాయి. రాయల్టీ లేకుండా ముడిసరుకు రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుని జరిమానాలు విధించసాగారు.


  వీధినపడ్డ కార్మికులు
  కొన్ని రోజుల ముందు వరకు తమ నుంచి మామూళ్లు దండుకున్న అధికారులు ఇప్పుడు ముప్పేట దాడులకు దిగడంతో పరిశ్రమల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మరోమార్గం లేక వారు పరిశ్రమలను మూసేశారు. కటింగ్, పాలిష్‌ చేసేందుకు ఒక్కొ పరిశ్రమలో 10 నుంచి 15 మంది వరకు పనిచేస్తారు. పరిశ్రమలు మూతపడడంతో ప్రత్యక్షంగా వాటిని నమ్ముకుని ఉన్న కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఇక్కడి పరిశ్రమలను నమ్ముకుని తాడిపత్రిలో దాదాపు 500కు పైగా లారీలు నడుస్తున్నాయి. పరిశ్రమలు మూతపడడంతో లారీలకు బాడుగ లేకుండా పోయింది. ఫలితంగా లారీల యాజమాన్యాలు వాటిని నమ్ముకుని జీవిస్తున్న డ్రైవర్లు, క్లీనర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి.

   

   

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా