బస్తీమే..కుస్తీ

12 Jun, 2016 01:26 IST|Sakshi
బస్తీమే..కుస్తీ

నేటికీ కుస్తీ పోటీలు పదిలం
‘ఖేడ్’లో ముమ్మరంగా  పోటీల నిర్వహణ
పోటీలపై పెరుగుతున్న ఆదరణ
ఆసక్తి చూపుతున్న యువకులు

 బహుమతులు, పారితోషికాలు మల్లయోధుల సొంతం ఉప్పొంగే ఉత్సాహం.. విజయతీరానికి చేరుకోవాలనే ఆత్రుత.. డప్పుల మోతలు.. ప్రజల కేరింతలు.. నిర్వాహకుల ప్రోత్సాహం.. వెరసి రంజుగా సాగే కుస్తీ పోటీలు. మల్లయోధులు హోరాహోరీగా తలపడే తీరు వీక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. మల్ల యోధులు సైతం ఎవరికి వారు రక్తం ఉడికిపోయేలా పోరాడుతూ ఎదుటి వారిని ఆత్మరక్షణలో పడేస్తుంటారు. ఎంతోమంది తమ అభిరుచి మేరకు మల్లయుద్ధంలోకి వస్తుంటారు. పేరు ప్రతిష్టల కోసం ఎంతో శ్రమించి ఈ రంగం వైపు వస్తుంటారు. వారి జీవన శైలి కూడా భిన్నంగా ఉంటుంది. వృత్తి ఏదైనా ప్రవృత్తిని కుస్తీ పోటీలుగా ఎం చుకుని రాణిస్తున్నారు.   - కంగ్టి/కల్హేర్

కంగ్టి/కల్హేర్ : ఏటా నూతన సంవత్సరాదిగా ఉగాది పండుగతో ఆయా గ్రామాల్లో కుస్తీ పోటీలు ప్రారంభమవుతాయి. అదీగాక ఊరూరా నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాల్లోనూ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో స్థానికులు, పరిసర గ్రామాల వారు, సరిహద్దు రాష్ట్రాల నుంచి మల్లయోధులు పాల్గొంటారు. కంగ్టి, కల్హేర్ మండలాల్లోనే వందల సంఖ్యలో మల్లయోధులు కుస్తీపోటీల్లో తలపడుతున్నారు. కంగ్టి మండలం గాంధీనగర్, సాధుతండా, దేవ్యాతండా, ఘన్‌పూర్ తండా, భీంరా తండా, రాంసింగ్ తండా, జీర్గీ తండాలతోపాటు కల్హేర్ మండలం బీబీపేట్, పత్తేపూర్, బొక్కస్‌గాం, మీర్ఖాన్‌పేట్, తండాల్లో వందల సంఖ్యలో మల్లయోధులు ‘కుస్తీ’ పడుతుంటారు. ఏటా కల్హేర్ మండలంలో అత్యధికంగా పోటీలు నిర్వహిస్తారు. కంగ్టిలో మూడు ఆలయాల వద్ద, నారాయణఖేడ్‌లో నాలుగు గ్రామాల్లో, మనూర్‌లో మూడు గ్రామాలు, పెద్దశంకరంపేట మండలంలో మూడు చోట్ల కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు.

 విజేతలకు వెండి కంకణం బహూకరణ..
పోటీలో పాల్గొనే మల్ల యోధులకు నిర్వాహకులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహంగా నగదు పారితోషికం లేక వెండి కంకణాన్ని బహూకరిస్తారు. విజేతలు తాము అందుకున్న బహుమానాన్ని అందరికి చూపుతూ కల్లంలో కొంత సమయం విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రేక్షకులు సైతం తమకు తోచినంత నగదును ఆనందంతో అందజేస్తారు.

 ఆహార అలవాట్లు ఇలా..
మల్ల యోధుల ఆహార అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. రోజూ తీసుకునే ఆహారంతోపాటు శీతాకాలం ఆరంభంలో అంజీర్, కొబ్బరి, కిస్‌మిస్, కాజు, ఖర్జూరం, బాదాం, ఆవునెయ్యితో తయారు చేసిన హల్వాతోపాటు పలు రకాల పండ్లను అదనంగా తీసుకుంటారు. దీనికితోడు నిత్యం వ్యాయామం చేస్తారు. డిప్స్ కొట్టడంతో చేతి కండలు పటిష్టంగా మారేలా సాధన చేస్తారు.

 వంశపారంపర్యంగా...
మల్లయోధులు వంశపారంపర్యంగా కుస్తీ పోటీల్లోకి వస్తున్నారు. అప్పటికే వీరికి ఈ ఆటపై పరిచయం ఉంటుంది. తండాల్లో అత్యధికంగా గిరిజనులు తండ్రి, తాతల పేరు, ప్రఖ్యా తులను కాపాడేందుకు కుస్తీలపై ఆసక్తి కనబరుస్తున్నారు. మల్లయోధులు ఉద్యోగాలు పొందినా యువకులకు రెజ్లింగ్‌లో శిక్షణనిస్తూ పౌరాణిక కాలం నుంచి వస్తున్న కుస్తీ పోటీలకు ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 పీఈటీలుగా పహిల్వాన్లు...
క ల్హేర్ మండలంలో పీఈటీలుగా పనిచేస్తున్న ముగ్గురు గతంలో కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారే. దీంతో వారు విద్యార్థుల ఆసక్తికనుగుణంగా రెజ్లింగ్‌లో తర్ఫీదునిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మల్లయోధులే పీఈటీలు కావడంతో కుస్తీ పోటీల విభాగంలో విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. బీబీపేట్ జంలా తండాకు చెందిన సంగ్రామ్, గణేష్, బల్‌రాం కుస్తీ ఆటతోపాటు చదువుపై దృష్టి పెట్టారు. వారి కృషి మేరకు ఈపీటీలుగా అవకాశాలు వచ్చాయి. బాచేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో సంగ్రాం, సిర్గాపూర్‌లో బల్‌రాం, ఖేడ్ మండలం తుర్కపల్లిలో గణేష్ పీఈ టీలుగా పనిచేస్తున్నారు. వీరు రాష్ర్టస్థాయి, జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. ప్రతిభకు గుర్తింపుగా బంగారు, కాంస్య పతకాలు సాధించారు.

బంధువులను చూసి ప్రేరణ పొందా..
కర్ణాటక, మహారాష్ట్రలో మా బంధువులు ఉన్నారు. వారి వద్దకు వెళ్లినప్పుడు కుస్తీ పోటీలు చూసి ప్రేరణ పొందా. నాతోపాటు పదోతరగతి చదువుతున్న తమ్ముడు రాథోడ్ విజయ్ సైతం పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనుబరుస్తున్నాడు. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో నిర్వహించే పోటీలతోపాటు తడ్కల్, బాన్సువాడ, కంగ్టి, పిట్లంలో నిర్వహించే పోటీల్లో పాల్గొని గెలుపొంది పారితోషికం, బహుమతులు సొంతం చేసుకుంటున్నాం.  - రాథోడ్ ప్రకాష్, ఘన్‌పూర్ తండా, కంగ్టి

 కుస్తీలో రాణిస్తున్నా...
కుస్తీలు పట్టడం హాబీగా తీసుకుని ప్రాక్టీస్ చేసి పరిసర ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాను. మూడు రాష్ట్రల సరిహద్దులో ఉండడంతో కంగ్టి, తడ్కల్, రాయిపల్లి, చింతాకీ, సావర్‌గాం తదితర గ్రామాల్లో కుస్తీ పోటీల్లో పాల్గొన్నాను. వంశపారంపర్యంగా కుస్తీపోటీల్లో పాల్గొంటున్నాం. తండ్రి బిజ్జు, తాత దేవ్‌జీలు కూడా పోటీల్లో మంచి ప్రతిభ కన బర్చారని తండా వాసులు చెప్పుకుంటారు.
- రాథోడ్ లక్ష్మణ్, దెగుల్‌వాడి దేవ్లా తండా, కంగ్టి

విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను
చిన్నప్పటి నుంచే కుస్తీ పట్టడం నేర్చుకున్నాను. నాన్న శివరాం, తాత ఓంలా నాయక్ కూడా కుస్తీలు పట్టేవారు. కుస్తీ పట్టి మంచి ప్రతిభ కనబర్చడంతోనే నాకు గుర్తింపు వచ్చింది. దీనికి తోడు చదువుకోవడంతో పీఈటీ ఉద్యోగం వచ్చింది. చాలా మంది విద్యార్థులకు రెజ్లింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను.  - సంగ్రాం, పీఈటీ, జెడ్పీహెచ్‌ఎస్ బాచేపల్లి, కల్హేర్

చిన్నప్పటి నుంచే పోటీ పడ్డాం..
చిన్నప్పటి నుంచే కుస్తీ పడడం నేర్చుకున్నా. ఇటీవలే కుస్తీపట్టడం మానేశా. వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్నా. నా కొడుకు తుకారాం మాత్రం పోటీల్లో పాల్గొని రాణిస్తున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో నేను కుస్తీపోటీలకు దూరంగా ఉన్నా. 
- శివరాం, బీబీపేట, జంలాతండా, కల్హేర్

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు