కనుల పండువగా తెప్పోత్సవం

12 Oct, 2016 23:58 IST|Sakshi
కనుల పండువగా తెప్పోత్సవం
యానాం టౌన్‌ :
యానాం వేంకటేశ్వరస్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి  మీసాల వెంకన్న స్వామి వారి తెప్సోత్సవాన్ని స్థానిక అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్‌గాంధీ రివర్‌బీచ్‌ వద్ద గౌతమి గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. విద్యుత్‌ దీపాలు, వివిధరకాల పూలతో హంసరూపంలో సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుతీరిన వేంకటేశ్వరస్వామివారు గౌతమి గోదావరిలో కొంతసేపు విహరించారు. తొలుత తెప్పపై ప్రముఖ వైఖానస పండితులు వాడపల్లి గోపాలాచార్యులు, ఆలయఅర్చకులు, వేదపండితులు ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. పరిపాలనా«ధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేవస్దాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్‌ పాల్గొన్నారు. గౌతమిగోదావరిలో గంటపాటు సాగిన తెప్పోత్సవాన్ని వందలాది మంది భక్తులు, స్థానిక ప్రముఖులు, నాయకులు తిలకించారు. 
 
మరిన్ని వార్తలు