సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలే

12 Dec, 2016 15:17 IST|Sakshi
సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలే
ఏపీ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌
ఘనంగా యానాం కవితోత్సవం-2016
ఉభయ రాష్ట్రాల నుంచి రచయితలు, కవులు రాక
యానాం టౌన్‌ : కవులు, రచయితలు చేసే రచనల ద్వారానే నిజమైన మార్పు వస్తుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలేనని, మంచి రచనలు సమాజ ఉన్నతికి దోహదపడతాయని చెప్పారు. స్థానిక కవి సంధ్య, స్ఫూర్తి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం యానాం కవితోత్సవం–2016 నిర్వహించారు. కవి సం«ధ్య అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్‌ శిఖామణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన గౌరవ అతి«థిగా ప్రసంగించారు. కవులు, రచయితలు తెలుగువారిలో భాషాభిమానం పెంపొందించడానికి మరింత కృషి చేయాలన్నారు. అప్పుడే కవులు, రచయితలు చేసే రచనలకు విలువ ఉంటుందన్నారు. కన్నడులకు, తమిళలకు ఉన్న భాషాభిమానం తెలుగువారిలో లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు జాతి గొప్పది, మన భాష గొప్పది అన్న భావన అందరిలోనూ కలగాలని ఆకాంక్షించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి అవసరమని, కవిత్వం మనిషిని స్పందింపజేస్తుందని చెప్పారు. 
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి ‘మానవ నాగరికత– కవిత్వం’ అంశంపై మాట్లాడారు. మానవ వికాసానికి సాహిత్యం దోహదం చేస్తుందన్నారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, ప్రముఖ కవి ఆకెళ్ల రవిప్రకాష్‌ మాట్లాడుతూ గతంలో తాను యానాం  పరిపాలనాధికారిగా పనిచేశానని, అప్పట్లో కవిత్వం మీద ఉన్న ఆసక్తితో తొలిసారి ఉగాదికి కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్‌ శిఖామణి మాట్లాడుతూ ఎర్రన రచించిన పద్యాన్ని తనదైన శైలిలో వినిపించారు.శిఖామణి సాహితీ తొలి పురస్కారం కె.శివారెడ్డికి ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్, మధునాపంతుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌సెర్టు కవితోత్సవం–2016 ప్రారంభం
యానాం గోదావరి తీరం శనివారం సాహితీ సుగంధాలతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు తరలివచ్చి తమ సాహిత్యం, కవిత్వంతో సాహితీ ప్రియులను, అభిమానులను అలరించారు. కవిసంధ్య సాహితీ, సాంస్కృతిక సంస్థ, స్ఫూర్తి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గాజుల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బొజ్జా తారకం, ఆవత్స సోమసుందర్‌ ప్రాంగణంలో యానాం కవితోత్సవం–2016ను నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకను ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు దివంగత మంగళంపల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, కొలకలూరి ఇనాక్, ప్రముఖ చిత్రకారులు శ్రీలా వీర్రాజు, అక్బర్, ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, కవి ఆకెళ్ల రవిప్రకాష్‌ , ఇండియా టూరిజం ఏడీ తుల్లిమల్లి విల్సన్‌సుధాకర్, కవిసంధ్య అధ్యక్షుడు డాక్టర్‌ శిఖామణి, కవి దాట్ల దేవదానంరాజు, డాక్టర్‌ వరుగు భాస్కరరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, సాహితీప్రియులు, అభిమానులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సహకారం, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కళలు, సాంస్కృతికశాఖ సౌజన్యంతో డాక్టర్‌ శిఖామణి సారథ్యలో ఈ కవితోత్సవాన్ని నిర్వహించారు. 
 
 
మరిన్ని వార్తలు