నెగ్గిన యనమల పంతం.. కోడెల యత్నాలు విఫలం

29 Jan, 2016 09:14 IST|Sakshi
నెగ్గిన యనమల పంతం.. కోడెల యత్నాలు విఫలం

- హైదరాబాద్‌లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- మంత్రుల ద్వారా సీఎంపై ఒత్తిడిపెంచిన యనమల


సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తన పంతం నెగ్గించుకున్నారు. హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రుల ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆమోదింప చేసుకున్నారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో ప్రకటన చేయించారు.

సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు పలువురు, అధికారులు నూతన రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో నివాసం ఉండటంతో పాటు విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా అక్కడే నిర్వహిస్తే బాగుంటుందని సభాపతి కోడెల శివప్రసాదరావు భావించారు. ఇదే విషయం సీఎంతో చర్చించి గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్‌కు అధికారుల బృందాన్ని పంపించి సభ నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందింపజేశారు. కే ఎల్ విశ్వవిద్యాలయాన్ని కోడెల స్వయంగా పరిశీలించారు. అక్కడ సమావేశాల ఏర్పాటుకు ఇబ్బంది ఏమీ ఉండదని ప్రభుత్వానికి అసెంబ్లీ వర్గాలు ఓ నివేదికను కూడా అందించాయి. హాయ్‌ల్యాండ్ అంశం కోర్డు పరిధిలో ఉన్న నేపధ్యంలో కేఎల్ విశ్వవిద్యాలయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారుకూడా.

అయితే గత శాసనసభలో.. తర్వాతి సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ప్రకటించిన యనమల.. ఆమేరకు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల అంశం సమావేశంలో ఎలాగైనా ప్రస్తావనకు వస్తుందనే జనవరి 25వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చక్రం తిప్పారు. కె.అచ్చెన్నాయుడుతో పాటు పలువురు మంత్రులతో సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తే మంచిదని, గతంలో ప్రైవేటు సంస్థల్లో ఏ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని, ఇప్పటికిపుడు ఏర్పాట్లు చేయాలన్నా కష్టమేనని, ఖర్చు కూడా ఎక్కువవుతుందని, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పించారు. దీంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహిస్తామని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. తన ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకునేలా సీఎంపై ఆర్థిక మంత్రి యనమల ఒత్తిడి తేవటం పట్ల స్పీకర్ కోడెల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు