యనమల విల‌విల‌... జ్యోతుల మిలమిల

7 Jul, 2017 13:13 IST|Sakshi
యనమల విల‌విల‌... జ్యోతుల మిలమిల
యనమల వర్సెస్‌ జ్యోతుల
పట్టుకోసం పాకులాట
అంతర్గతపోరు చివరి మజిలీలో ఫలించని యనమల యత్నాలు 
రక్తికడుతున్న టీడీపీ రాజకీయాలు 
 
జిల్లా తెలుగు దేశం పార్టీలో సమతూకం కుదరడం లేదు. బలవంతపు పెళ్లిలా తంతు చేస్తున్నా రాజకీయ చదరంగంలో పావులు కదలిక ఆగడం లేదు. మరింత జోరందుకుంటోంది. వలస వచ్చిన వాడికి తృణమో, పణమో అర్పించుకోకపోతే అసలకే ఎసరు వస్తుందేమోనని వడివడిగా రాజకీయ పరిణామాలల్లో మార్పు తీసుకురావాలనుకున్న అధిష్టానానికి గత మూడు నెలలుగా చుక్కెదురవుతూ వస్తోంది.
 
జిల్లా మినీ మహానాడుకు ముందే ఈ వివాదాలకు చెక్‌ పెడదామనుకున్న ‘పెద్దలు’ వచ్చి రాయ‘బేరాల’కు దిగినా ఫలితం దక్కలేదు. ఆలస్యంగానైనా అనుకున్నట్టుగానే పదవుల పందేరానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నా అసమ్మతి రాగానికి మాత్రం తాళం పడేటట్టుగా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
 
 కాకినాడ : టీడీపీ రాజకీయాలు పాము, ముంగిస కథలా నడుస్తున్నాయి. ఎవర్ని  ఎవరు మింగేస్తారో గాని ఎత్తుకు పైఎత్తులతో అంతర్గత రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయి. టీడీపీలోకి రాకుండా జ్యోతులను అడ్డుకునేందుకు యనమల  కడదాకా పోరాడారు. జ్యోతులకు మంత్రి పదవి దక్కనివ్వకుండా యనమల విజయం సాధించారు. యనమల అభ్యంతరం తెలిపినా తన కుమారుడికి జెడ్పీ చైర్మన్‌ పదవి విషయంలో అధిష్టానం వద్ద జ్యోతుల లైన్‌ క్లియర్‌ చేసుకోవడంతో ఇకపై అసలు సిసలైన రాజకీయాలు ఆవిష్కృతం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  
 
ఎత్తుకు పైఎత్తులు...
జ్యోతులకు యనమల బద్ద విరోధి. అంతర్గత రాజకీయాల్లో యనమలతో ఇమడలేకనే పార్టీ (పీఆర్‌పీ) మారారు. ఆ తర్వాత అధికారం వస్తుందన్న ఆశతో జ్యోతుల నెహ్రూ వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ అధికారం రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఉండలేక... పదవీ వ్యామోహం, ప్యాకేజీలకు ఆశపడి మళ్లీ టీడీపీలోకి వలస వెళ్లారు. అయితే, టీడీపీలోకి వచ్చేముందు మంత్రి యనమలతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. చివరికి చంద్రబాబు సూచన మేరకు రాజీ ధోరణితో యనమల్ని కలిసి ఒప్పించుకున్నారు.
 
అధినేత ఆదేశాల్ని తోసిపుచ్చలేక యనమల కూడా కాదనలేకపోయారు. టీడీపీలోకి వచ్చాక మంత్రి పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ఈసారి యనమల పట్టు వదల్లేదు. తన ప్రత్యర్థికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో తన ఉనికికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనననే భయంతో అధిష్టానం వద్ద గట్టిగానే పోరాడి జ్యోతులకు బెర్త్‌ దొరకకుండా విజయం సాధించగలిదారు. దీంతో జ్యోతుల తీవ్ర నిరాశ నిస్పృహకు లోనవడంతో ఏదొ ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరచాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ చేయలేరన్న ధీమాతో జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబును బలి పశువును చేసేందుకు పావులు కదిపారు. నామనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి, జెడ్పీ చైర్మన్‌ పదవిని జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు కట్టబెట్టేందుకు పార్టీలో ఎట్టకేలకు ఒప్పందం కుదిర్చారు. 
 
జ్యోతులకు వ్యతిరేకంగా పావులు 
జెడ్పీ చైర్మన్‌ పదవి ఇస్తే జిల్లాలో జ్యోతులు పట్టు పెరుగుతుందన్న భయంతో నామన రాంబాబుకు వెనకుండి యనమల పావులు కదిపారు. జంప్‌ జిలానీకి పదవి ఎలా ఇస్తారని, చైర్మన్‌గా పనిచేసుందుకు సరిపోమా అన్న నినాదంతో నామనతో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వర్గీయులను ముందుకు ఉసిగొల్పారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమేంటని పలువురు జెడ్పీటీసీలు నిరసనకు దిగారు.
 
అధిష్టానం దిగి రాకుంటే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడమనే సంకేతాలను 22 జెడ్పీటీసీలుచే తెరవెనుక ఉండి యనమల వర్గం నిరసన గళం వినిపింపచేయించింది. కానీ తాటాకు చప్పుల్లేవీ పనిచేయలేదు. కాపు ఉద్యమం జిల్లాలో తీవ్రంగా నడుస్తున్న సమయంలో ఆ సామాజిక వర్గ నేతను పిలిచి అన్యాయం చేశారన్న అపవాదును మూటగట్టుకోవల్సి వస్తుందన్న ఉద్దేశంతో జ్యోతులకు జై కొట్లక తప్పిందికాదు. దీంతో యనమల వర్గానికి చెక్‌ పెట్టినట్టయింది.
 
 ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా...
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. నామన రాంబాబును తొలగించి జ్యోతుల నవీన్‌ను జిల్లా పరిషత్‌ పీఠంపై కూర్చోబెట్టడం వల్ల టీడీపీలో నెంబర్‌ టూ, సీనియర్‌ మంత్రిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడుపైనే ప్రధాన ప్రభావం పడబోతోంది.  జ్యోతులకు, యనమలకు మధ్య ఉన్న వైరం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. జిల్లా పరిషత్‌ కేంద్రంగా చక్రం తిప్పే యోచనలో జ్యోతుల ఉన్నారు. జిల్లా స్థాయిలో తన కనుసన్నల్లో పనులు జరిగేలా పావులు కదిపే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలో యనమల వర్గం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. లోకేష్‌ కోటరీ డైరెక్షన్‌లో అదిష్టానం కూడా వ్యూహాలు మార్చుకుని వెళ్లడంతో యనమలకు మరింత సంక్లిష్టం పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సీనియర్లను వరుసగా పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో యనమల కూడా ప్రాధాన్యత తగ్గి లోకేష్‌ కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారన్న చర్చ నడుస్తోంది. కార్తికేయ మిశ్రాను వద్దని యనమల చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్‌గా నియమించారని, ఈ విషయంలో యనమలను పట్టించుకోలేదన్న వాదనలున్నాయి.
 
అటు జెడ్పీ చైర్మన్‌ పదవి విషయంలోనూ, ఇటు కలెక్టర్‌ నియామకంలోనూ యనమలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే అధిష్టానం వద్ద పట్టు తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఇకపై  రాష్ట్ర పద్దులు చూసుకోవడం తప్ప జిల్లాలో చేసేందేమి ఉండదదని, చక్రం తిప్పే పరిస్థితి అస్సలుండదని యనమల ప్రత్యర్థి వర్గం సంబరపడుతోంది.  
మరిన్ని వార్తలు