నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?

14 Oct, 2016 01:48 IST|Sakshi
నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?

నీతి సూక్తులొద్దు.. మీ అవినీతి,
 లంచగొండితనం గురించి మాట్లాడండి
 సీఎం చంద్రబాబుకు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు  నీతి సూక్తులు చెప్పడం మాని, ఆయన అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడాలని పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. బుగ్గన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ రూ.500, రూ.1,000 నోట్ల ముద్రణ నిలిపివేయాలని చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు చెబుతున్నారు? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రూ.500, రూ.1,000 నోట్ల నల్లధనం ఇస్తూ దొరికిపోయినందుకా? లేక ఎన్నికల్లో రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించినందుకా?’’ అని ప్రశ్నించారు.
 
  దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల నల్లధనాన్ని ఐడీఎస్-2016 పథకం కింద పలువురు వెల్లడిస్తే ఏపీ, తెలంగాణలో ఒకే వ్యక్తి రూ.10 వేల కోట్లు ప్రకటించారని చంద్రబాబు అంటున్నారు, అసలు నిగూఢమైన ఈ సమాచారం చంద్రబాబుకు ఎలా వచ్చిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివ రాలు అత్యంత రహస్యమైనవని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి, పన్నుల అధికారులు చెబుతూ ఉంటే బాబుకు ఎలా తెలిశాయో చెప్పాలని నిలదీశారు. నల్లధనాన్ని ప్రకటించిన వారి జాబితాను వెల్లడించాలని కోరుతున్నామన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో ఏపీ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా గణతికెక్కినట్లు ఎన్‌సీఏఈర్ సంస్థ పేర్కొంది.
 
  దానికి ముందు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పట్టిసీమ మొదలు అమరావతి భూముల దాకా అంతా అవినీతిమయమే. రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు పెట్టిన రూ 400 కోట్లు ఎక్కడికి పోయాయి? పట్టిసీమలో రూ.1,600 కోట్లు ఎక్కడికి చేరాయి? గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఖర్చు పెట్టామని చెబుతున్న రూ.3,000 కోట్లు ఏవీ? పారిశ్రామికవేత్తల రాయితీల పేరుతో విడుదల చేసిన రూ.2,200 కోట్లు ఏమైపోయాయి?’’అని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాబు జీఎస్‌డీపీపై తప్పుడు లెక్కలు వెల్లడించారన్నారు.
 

మరిన్ని వార్తలు