'టీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం'

23 Jul, 2015 22:32 IST|Sakshi
'టీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం'

సత్తుపల్లి (ఖమ్మం జిల్లా): 'కేసీఆర్‌పై ఇక యుద్ధం మొదలైంది.. ఆరు నెలలు ఓపిక పట్టండి.. టీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం.. రాజకీయ సన్యాసం తీసుకుంటాం' అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యేల బృందం సండ్ర వెంకటవీరయ్యకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 'మా పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నప్పుడు కేసుకాదు.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయానా డబ్బుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. అయినా కేసు కాలేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇటీవల జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారు. తలసాని శ్రీనివాసయాదవ్‌కు సనత్‌నగర్‌లో మూడో స్థానం దక్కుతుంది. 25వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే ఏ తప్పు చేయకపోయినా కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని పొరబాట్లు జరగటం వల్లే సీట్లు తగ్గాయని.. కనీసం 30 నుంచి 32 స్థానాలు రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి తమ పార్టీని దెబ్బతీసేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. రాజకీయంగా తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. విశాఖపట్నంలో తమ పిల్లలు చదువుతుంటే ఫార్మా ఇండ్రస్ట్రీ పెట్టానని ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల అఫిడవిట్‌లో ఏవైతే దాఖలు చేశానో.. దానికంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా.. రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. బినామీల పేరుమీద అక్రమ ఆస్తులు సంపాదించాల్సిన కర్మ పట్ట లేదన్నారు. పోలీసులు, అధికారులను ప్రయోగించి పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాగంటి గోపినాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రామనాధం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు