..అయితే ఓకే!

13 Apr, 2017 00:23 IST|Sakshi
..అయితే ఓకే!
– నీరు–చెట్టు పేరుతో దోపిడీకి ఎత్తుగడ
– నాలుగు నెలలుగా 73 పనులకే అనుమతులు
– రెండు రోజుల్లో ఏకంగా 1600 పనులకు ప్రతిపాదనలు
– ఉన్నతాధికారి బదిలీ సమాచారంతో హడావుడి    
– నోట్ల కట్టలతో తిరుగుతున్న టీడీపీ నాయకులు
– కొందరు ఇంజినీరింగ్‌ అధికారులతో ఒప్పందాలు!
– వాటాలు కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం
 
కర్నూలు సిటీ:  జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి బదిలీ అవుతున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు ఆదాయ వనరుగా ఉన్న నీరు- చెట్టు పనులను దక్కించుకునేందుకు యత్నాలు మొదలు పెట్టారు. కొందరు ఇంజినీరింగ్‌ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఓ అధికారి అంతా తానే చేస్తున్నట్లు.. డబ్బులిస్తే పని అయిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. పనుల కోసం భారీ ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు..వాటాలు ఇస్తామంటూ ఏకంగా నోట్ల కట్టలను పట్టుకొని తిరగడం చర్చనీయాంశమైంది. 
  
నీరు- ప్రగతి, నీరు- చెట్టు.. దశాబ్దాలుగా చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు, వాగుల్లో పేరుక పోయిన పూడిక తీసి భూగర్భజలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు. వీటిలో నీరు–చెట్టు కింద చేపడుతున్న పనులు అధికార పార్టీ నేతలకు, కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి నీరు–చెట్టు కింద పూడిక తీత పనులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సాంకేతిక గణాంకాల ఆధారంగా అంచనాలు ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. సమావేశాల్లో టీడీపీ నేతలు ఈ విషయంపై అడిగితే ప్రతిపాదనలు తీసుకొని అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జనవరి నెల నుంచి సుమారు 920 పనులు ప్రతిపాదనలు చేస్తే కేవలం 73 పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే ఇటీవల జిల్లా ఉన్నతాధికారి బదిలీ అవు తున్నారనే సమాచార నేపథ్యంలో రెండు రోజుల నుంచి జలమండలిలో నీరు–చెట్టు పనుల ప్రతిపాదనల హడావిడి నెలకొంది. 
 
దోపిడీకి ఎత్తుగడ...!
జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ పరిధిలో కర్నూలు, నంద్యాల డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 157 చెరువులు, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 477 చెరువులు ఉన్నాయి. గత రెండేళ్లుగా చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు, వాగుల్లో పేరుకపోయిన పూడిక తీసేందుకు నీరు–చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఉన్నతాధికారి బదిలీ అయ్యే అవకాశం ఉండడంతో సదరు అధికారికి ప్రతిపాదనల పైళ్లను కుప్పలు తెప్పలుగా పంపుతున్నారు. దీనికితోడు ఓ అధికారి అంతా తానే నడిపిస్తున్నట్లు మీరు ప్రతిపాదనలు ఇవ్వండి ఓకే  చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఇందుకు అంచనాలపై అనుమతి వచ్చిన వెంటనే ఒక శాతం ఇవ్వాలని ఒప్పంద చేసుకుంటున్నారు. రెండు రోజుల్లోనే చిన్న నీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్‌ పరిధిలోని మండలాల్లో నుంచి సుమారు 1600 పనులకు అనుమతులు తీసుకునేందుకు ఉన్నతాధికారిని కోరినట్లు తెలిసింది. నంద్యాల డివిజన్‌ నుంచి కూడా సుమారు వెయ్యికి పైగా పూడికతీత పనుల జాబితా తయారు అవుతున్నట్లు ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచే 500 పనులకు అనుమతులు కోరే అవకాశం ఉంది.
 
 తాత్కలిక ఒప్పందాలు...!
నీరు–చెట్టు కింద చేపట్టే పూడికతీత పనులకు సంబంధించి అంచనాలు తయారు చేసే దగ్గర నుంచి చేసిన పనికి బిల్లు చేసే వరకు వాటాల విషయంలో తాత్కలిక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం.  అంచనాలు వేసి, అనుమతులు తీసుకవచ్చేందుకు ఒక శాతం, అగ్రిమెంట్‌ చేసేందుకు 0.5 నుంచి 1శాతం, పనికి బిల్లు చేసేందుకు ఒక్కో చోట ఒక్కో శాతం వాటాగా నిర్ణయించారు. కొంత మంది ఇంజినీర్లు ఏకంగా ‘మీ మండలంలో పనులకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకునేందుకు కొంత నగదు ఖర్చు పెట్టుకోండి మీకెన్ని పనులు కావాలో చెప్పండి’’ అంటూ నేరుగా మండల స్థాయిలోని టీడీపీ నాయకులతో బేరం కుదుర్చుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నాయకలు నోట్ల కట్టలతో కర్నూలు చేరుకోవడం చర్చనీయాంశమైంది.
 
అవన్నీ ఆరోపణలే
– ఎస్‌.చంద్రశేఖర్‌రావు, పర్యవేక్షక ఇంజనీర్, జలవనరుల శాఖ 
నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపట్టేందుకు పక్కాగా అంచనాలకే అనుమతులు కోరుతున్నాం. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఇంజినీర్ల నుంచి భారీగా పనులకు అంచనాలు వస్తున్న మాట వాస్తవమే. అన్ని విధాలుగా కరెక్టుగా ఉంటేనే అనుమతులిస్తామని ఏఈలకు సూచిస్తున్నాం. పనులకు సంబంధించి ఎలాంటి వాటాలు లేవు. అవన్నీ ఆరోపణలే.  
 
మరిన్ని వార్తలు