యువకుడి గల్లంతు

4 Sep, 2016 00:13 IST|Sakshi
యువకుడి గల్లంతు
 
సంతనూతలపాడు : సాగర్‌ కాలువలో సరదాగా ఈతకు దిగిన ఐదుగురు యువకుల్లో ప్రమాదవశాత్తూ ఒకరు గల్లంతయ్యారు. ఈ సంఘటన చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని సాగర్‌ కాలువలో శనివారం ఉదయం జరిగింది.
 
వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పోసా అరుణ్, పూలా సురేష్, గుత్తా రాకేష్, కావేటి రామాంజనేయులు, నందికం హరిలు ఓ కారులో గుంటూరు బయల్దేరారు. మార్గమధ్యంలోని చీమకుర్తి మండలం చీమలమర్రి వద్ద సాగర్‌ కాలువ వద్ద కారు ఆపుకుని సాగర్‌ కాలువలోకి ఈతకు దిగారు. కొద్ది సేపటి తర్వాత నందికం హరి అనే 19 ఏళ్ల యువకుడు గల్లంతై డ్రాప్‌లో పyì పోయాడు. కాపాడేందుకు అతని సొంత బావ కావేటి రామాంజనేయులు కూడా డ్రాపులోకి దూకాడు. బావమరిది కోసం ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. పైగా అతడు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వెంటనే ఓ బెల్ట్‌ సాయంతో రామాంజనేయులును అతికష్టం మీద బయటకు తీశారు.  
 
హృదయ విదారకం
డ్రాపులో హరి కొద్దిసేపు కొట్టుమిట్టాడుతుండటాన్ని తోటి స్నేహితులు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈతరాక రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరిని కాపాడాలంటూ వేడుకున్నారు. ఎవరూ డ్రాప్‌లోకి దిగేందుకు ధైర్యం చేయలేదు. బావమరిది గల్లంతుపై బావ రామాంజనేయులు కన్నీటిపర్యంతమయ్యాడు. తన భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ కుమిలిపోయాడు.
 
చీమలమర్రి డ్రాప్‌ల వద్ద గాలింపు
కొద్ది సేపటి తర్వాత గల్లంతైన హరి చీమలమర్రి డ్రాప్‌ల నుంచి దిగువకు కొట్టుకెళ్లాడు. యువకుడి ఆచూకీ కోసం సీఐ ఎం.మురళి, సంతనూతలపాడు ఎస్సై హుస్సేన్‌బాషాలు రామతీర్థం జలాశయం వద్ద నీటి వేగాన్ని తగ్గించారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ వద్ద గత ఈతగాళ్లు హరి ఆచూకీ కోసం గాలించారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఆచూకీ దొరకలేదని సీఐ తెలిపారు. ఈతముక్కల మేజర్‌ వరకు వెతికిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు