ప్రేమ ఎంత కఠనం

7 Mar, 2017 23:23 IST|Sakshi
ప్రేమ ఎంత కఠనం

యువజంట ఆత్మహత్యాయత్నం
ప్రియుడు మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం
యువతికి పెళ్లి నిశ్చయం
వివాహానికి పెద్దలు అంగీకరించరని తొందరపడ్డ ప్రేమికులు
ఇరు కుటుంబాల్లో విషాదం


ఏడడుగులు వేద్దామనుకున్నారు.. జీవితాంతం కలిసి నడుద్దామనుకున్నారు.. ఉద్యోగం వచ్చాక తమ ప్రేమ విషయం  పెద్దలకు చెప్పి ఒప్పించాలని ఆశ పడ్డారు.. అంతలోనే అమ్మాయికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆందోళన పడ్డారు.. తరుణోపాయం తెలీక మరణమే శరణమనుకొని విషం తాగారు.. తల్లిదండ్రులకు విషాదం మిగిల్చారు.. ప్రేమికుడు కనుమూయగా.. ప్రియురాలు చావుబతుకుల్లో ఉంది.

చోడవరం: ఒకే ఊరు.. ఇద్దరివీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే.. పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడంతో అందివస్తారని భావించారు. అంతలోనే ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. తూర్పుగోదావరి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామం శోకసముద్రంలో మునిగింది. తమ అనురాగం గురించి పెద్దలకు చెప్పడానికి సాహసం చేయలేని ఆ ప్రేమ జంట.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఇద్దరూ కలిసి పరీక్షలు కూడా రాశారు. ఇంతలోనే ప్రియురాలికి కుటుంబసభ్యులు వేరొకరితో పెళ్లి కుదర్చడంతో ఇద్దరూ కలత చెందారు. దేవుని సన్నిధిలో ఒకటవుదామని చోడవరం వచ్చి అక్కడే ఆత్మహత్యకు యత్నించడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన ఆ రెండు కుటుంబాలనూ దుఃఖసాగరంలో ముంచింది.

ఎదిగొచ్చిన కొడుకు వృద్ధాప్యంలో చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న సమయంలో విగత జీవిగా మారడం దాడి చంద్రశేఖర్‌ (27) కుటుంబ సభ్యులను కలచివేసింది. ఆస్పత్రి మంచంపై ప్రాణం లేకుండా పడి వున్న కొడుకుని చూసి తండ్రి రామచంద్రరావు, తల్లి కమల బోరున విలపించారు. విజ్ఞత కలిగిన కొడుకు ఇలా అకస్మాత్తుగా విగతజీవి కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకొని జీవించే ఈ కుటుంబం చంద్రశేఖర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎమ్మెస్సీ చదివిన కొడుక్కి పెద్ద ఉద్యోగం వస్తే కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటాడనుకున్నామని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోపక్క యువతి కుటుంబం మరింత శోకంతో మునిగింది. మరికొద్ది రోజుల్లో ఎంతో ఆడంబరంగా ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేకపోయినా తండ్రి, అన్నయ్య కలిసి చెల్లి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు.

ఇంతలోనే ప్రేమించిన వ్యక్తితో కలిసి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. కొన ఊపిరితో చోడవరం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న చెల్లిని బతికించుకోవడానికి అన్న ఎంతో ఆత్రుత పడ్డాడు. మత్యువుతో పోరాడుతున్న చెల్లెల్ని విశాఖపట్నంలో పెద్దాసుపత్రికి తరలించేందుకు తన చేతుల మీద తీసుకొచ్చి కారెక్కించి రోదించాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు