యువజంట ఆత్మహత్య

28 Jul, 2017 23:13 IST|Sakshi
యువజంట ఆత్మహత్య
వివాహేతర సంబంధమే కారణం?
ప్రేమికుడు పురిగొల్పడంతో వివాహిత ఆత్మహత్య
తనపై కేసు పెడతారన్న భయంతో భర్త కూడా..
అత్తింటివారే తన కుమార్తెను చంపారని తండ్రి ఆరోపణ
కాకినాడ రూరల్‌ : భార్యపై అనుమానం, ప్రైవేటు ఉద్యోగం మానేసి, జల్సాలకు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఖర్చు చేయడం, నిత్యం కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు.. దీంతో పాటు వివాహేతర సంబంధం ఉందని భావిస్తున్న ఆటో డ్రైవర్‌ పౌరుషం ఉంటే చావు అన్న మాటకు పట్టించుకున్న ఓ యువ జంట శుక్రవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ గొడారిగుంట మూడుగుళ్ల సెంటర్‌ సమీపంలో శాస్త్రి నగర్‌లో  నివాసం ఉంటున్న  బయ్యపురెడ్డి దుర్గా ప్రసాద్‌ (34), మంగాదేవి (25)లు ఈ ఘటనలో మృతి చెందారు. వీరికి ఏడేళ్ల సాయిలోకేష్‌, ఐదేళ్ల ధీరజ్‌ పిల్లలు ఉన్నారు. సామర్లకోటకు చెందిన కె సత్యనారాయణ కుమార్తె మంగాదేవిని, 2010లో కాకినాడ గొడారిగుంటకు చెందిన బయ్యపురెడ్డి దుర్గాప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు కట్నం, 8 కాసుల బంగారు ఆభరణాలు కట్న కానుకలుగా అందించారు. దుర్గాప్రసాద్‌ ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఓ కాంట్రాక్టర్‌ వద్ద పని చేసేవాడు. భార్యపై అనుమానం పెంచుకున్న దుర్గాప్రసాద్‌ ఏడాదిన్నరగా తాను చేస్తున్న  పని మానేసి భార్యను సూటిపోటి మాటలు అంటూ గొడవకు దిగేవాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేయడమే కాకుండా పెళ్లి సమయంలో అత్తింటివారు బ్యాంకులో వేసిన రూ. 1.5 లక్షలను కూడా ఖర్చు చేసేశాడు. తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలను అమ్మేస్తానంటూ భార్యతో గొడవకు దిగేవాడు. మంగాదేవికి స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్‌ అప్పన్నతో వివాహేతర సంబంధం ఉందని, ఇది తన భర్తకు తెలిసిపోయిందని ఆమె అప్పన్నకు చెప్పిందని, దీంతో అతడు ఆమెను పౌరుషం ఉంటే చచ్చిపో అని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పాడని, తనపై ఎక్కడ కేసు పెడతారోనన్న భయంతో దుర్గాప్రసాద్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న లక్ష్మణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను జీజీహెచ్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. సర్పవరం సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణతో ఎస్‌ఐ స్వామినాయుడు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
గ్రామంలో విషాద ఛాయలు
అభంశుభం తెలియని చిన్నారులు అమ్మా, నాన్నలు ఎక్కడికి వెళ్లారంటూ దీనంగా అడగడం అక్కడివారిని కలచివేసింది. ఏ బాధలున్నా తమకు చెప్పుకుంటే పరిష్కరించేవారమని, కనీసం ఏం జరుగుతోందో కూడా తమ దృష్టికి తేలేదంటూ మంగాదేవి బంధువులు విలపిస్తున్నారు. చనిపోయేటప్పుడయినా పిల్లలు గుర్తుకురాలేదే అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రతిఒక్కరికీ తలలో నాలుకలా ఉండే దుర్గాప్రసాద్‌ చనిపోయాడంటే జీర్ణించుకోలేకపోతున్నామంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా మంగాదేవి తండ్రి కె.సత్యనారాయణ మాత్రం తన కుమార్తెను కావాలనే తన అల్లుడు దుర్గాప్రసాద్‌ ఉరేసి చంపేశాడని, తన కుమార్తె ఏ తప్పు చేయదని, చనిపోయేంత పిరికిది కాదని, కావాలనే చనిపోయిన వ్యక్తిపై అభాండాలు వేస్తున్నారన్నారు. తన అల్లుడు, అతని కుటుంబ సభ్యులే  కావాలని తన కూతుర్ని ఉరేసి చంపేశారన్నారు.  కేసు పెడతామన్న భయంతో అతను ఉరేసుకున్నాడన్నారు. తన కుమార్తెను ఎంతో గారాభంగా పెంచుకున్నానని, ఇప్పుడు తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ కన్నీరుమున్నీరుగా మృతురాలి తండ్రి సత్యనారాయణ విలపిస్తున్నాడు.  
మరిన్ని వార్తలు