దుగ్గొండిలో యువరైతు ఆత్మహత్య

20 Jul, 2016 20:12 IST|Sakshi

సాగు కోసం చేసిన అప్పులు ఎక్కువకావడంతో వాటిని తీర్చేమార్గంలేక ఓ యువరైతు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని శ్రీనివాసరెడ్డి(40) పదవ తరగతి వరకు చదివిన అనంతరం తండ్రి స్వామిరెడ్డి చనిపోవడంతో వ్యవసాయాన్ని చేపట్టాడు.

 

తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగ్గా పండక నష్టాలతోనే సాగు పనులు చేస్తున్నాడు. గతేడాది కరువు ప్రభావం వల్ల పంటలు సరిగ్గా పండలేదు. ఈ ఏడు రెండు ఎకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో మొక్కజొన్న వేశాడు. తరచూ వర్షం ముసురులా కురవడంతో భూమిలో పదును క్కువై రెండు పంటలు జాలువారి చనిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పటికి ఆయనకు రూ.6లక్షల అప్పులు ఉన్నారుు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంటకు పురుగు మందు పిచికారీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అప్పు లెక్కలేసుకున్నాడు.

రాత్రి పొద్దుపోయాక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కొంత సేపటి తర్వాత మెలుకువ వచ్చిన భార్య తలుపుతీసి చూడగా వాకిట్లో పడి ఉన్నాడు. దీంతో బోరున విలపింంచింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని భార్య ఉమ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

 

మరిన్ని వార్తలు