తల్లికి తెలిస్తే ఏమైపోతుందో...?

19 Aug, 2016 23:14 IST|Sakshi
తల్లికి తెలిస్తే ఏమైపోతుందో...?

వేదసమాజం వీధిలో అలముకున్న విషాదచాయలు
 శోకసంద్రంలో మునిగిన కుటుంభసభ్యులు    
  తల్లికి మరణవార్త తెలియకుండా జాగ్రత్తపడ్డ కుటుంభం

 
విజయనగరం జిల్లా ; రాజమహేంద్రవరంలోని గోదావరి నదిలోని కోటిలింగాల రేవుకు స్నానానికి వెళ్లిన సాలూరుకు చెందిన సిగడాపు చైతన్య(19) శవమై తేలాడు. రాజమహేంద్రవరంలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న చైతన్య గురువారం తన స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదుగురిలో ఇద్దరు నదిలో గల్లంతుకాగా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం సాయంత్రం 6గంటల వరకు గాలించారు. మరలా శుక్రవారం ఉదయం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించగా, చైతన్య మృతదేహం లభ్యమైంది. దీంతో నదిలో కొట్టుకుపోయిన తమ బిడ్డ,  ఎక్కడో ఒకచోట క్షేమంగా ఒడ్డుకు చేరుకుని వుంటాడన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి.
 
 విషాదంలో వేదసమాజం వీధి
 చైతన్య నదిలో శవమై తేలాడన్న విషయం తెలియడంతో స్థానిక వేదసమాజం వీధిలో విషాదచాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న చైతన్య బందువులు, స్నేహితులు అదిక సంఖ్యలో అతని ఇంటికి చేరుకున్నారు. చైతన్య గళ్లంతైన విషయం తెలుసుకున్న అతని పెదనాన్న బంగారయ్య తదితరులు రాజమహేంద్రవరంకు చేరుకుని, మృతదేహాన్ని సాలూరు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసారు.
 
స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు
 ఇంటికి పెద్దదిక్కవుతాడనుకున్న  బిడ్డ అర్దాంతరంగా తనువు చాలించాడన్న విషయం తెలిస్తే తల్లి శ్రీదేవి ఏమైపోతుందోనని, చైతన్య మరణ వార్త సాయంత్రం వరకు తెలియకుండా మృతుని కుటుంభసభ్యులు, బందువులు జాగ్రత్తపడ్డారు. తన బిడ్డను కాపాడంటూ ఆతల్లి ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటుంటే, పరామర్శించేందుకు వస్తోన్న బందువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకుపైనే ఆశలు పెట్టుకుని బతుకీడుస్తున్న చైతన్య తండ్రి సూర్యనారాయణ, తన బిడ్డ ప్రాణం పోయిందని తెలిసి కూడా, బార్యకు ఆవిషయం తెలిస్తే ఎక్కడ ఆమె గుండె ఆగిపోతుందోనన్న బెంగతో కడుపులోనే దుఃఖాన్ని దిగమింగుకుని బార్యకు దైర్యం చెబుతోన్న ఘటణ చూపరులను కలచివేసింది. వ్యవసాయం చేసుకుంటూ అతికష్టంమీద సూర్యనారాయణ తన కొడుకు చైతన్యను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. మరో ఏడాది కష్టపడితే చిన్నదో, పెద్దదో ఉద్యోగం వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో గోదావరి రూపంలో మృత్యువు కాటేయడంతో ఆకుటుంభంలో అల్లకల్లోలం రేగింది.

మరిన్ని వార్తలు