వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడి బలి

9 Jan, 2017 00:15 IST|Sakshi
వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడి బలి
- మూత్రం రావడం లేదని తెలిపినా పట్టించుకోని సిబ్బంది
- రాత్రంతా నరకయాతన అనుభవించి మృతి
- నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన 
 
నూనెపల్లె: వైద్యుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పలుకరించే నాథుడు కరువయ్యారు. పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపించినా అక్కడి సిబ్బంది గుండె కరుగలేదు. ప్రాణం పోయిన తర్వాత మా తప్పేమి లేదని తప్పుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అక్కలపల్లె గ్రామానికి చెందిన నర్రా చిన్న అల్లూరెడ్డి (42) దినసరి కూలీ. శుక్రవారం గిద్దలూరు పట్టణంలో పనులు ముగించుకుని ఇంటి వస్తుండగా ఓ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా అక్కడి వైద్యులు సిటీ స్కానింగ్‌కు సూచించడంతో శనివారం నంద్యాలకు వచ్చారు. పట్టణంలోని  ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌ మిషన్‌ పనిచేయక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి పక్కటెముకలు విరిగాయని ధ్రువీకరించి అడ్మిట్‌ చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మూత్రం రాక అల్లూరెడ్డి పొట్ట ఉబ్బింది. రాత్రి 11 గంటల సమయంలో సమస్య తీవ్రం కా వడంతో వైద్యులు, నర్సుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించ లేదు. ఉదయం విధులకు హాజరైన నర్సుల పరిసి​‍్థతిని వివరించగా సూచించగా డ్యూటీ డాక్టర్‌ వస్తారని చెప్పింది. ఉదయం 10 గంటల సమయలో అల్లూరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించలేదని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తంతో ఆందోళనకు దిగారు. భర్త మృతితో భార్య సుబ్బలక్ష్మమ్మ రోదిస్తూ  సొమ్మసిల్లి పడి పోయింది. మృతుడికి ముగ్గురు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు వివాహమైంది. 
 
విచారణ చేస్తాం: డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సూపరింటెండెంట్‌, నంద్యాల ఆసుపత్రి
అల్లూరెడ్డికి పక్కటెముకలు విరగడంతో ఆసుపత్రిలో చేర్చుకున్నాం. మొదట పరిస్థితి బాగానే ఉంది. రాత్రి సమయంలో వైద్యం అందని విషయంపై విచారణ చేస్తాం. డ్యూటీలో ఉన్న సిబ్బంది, డాక్టర్‌ నుంచి వివరాలు తెలుసుకుని, మృతుడి కటుంబనికి న్యాయం చేస్తాం.  
 
మరిన్ని వార్తలు