నిమజ్జనానికి వెళ్లి..విగతజీవిగా మారి..

16 Sep, 2016 00:43 IST|Sakshi
నిమజ్జనానికి వెళ్లి..విగతజీవిగా మారి..
 • హత్యకు గురైన యువకుడు
 • భట్టుపల్లి శివారు కోట చెరువు మత్తడి వద్ద ఘటన 
 • మడికొండ : గణపతి నిమజ్జనానికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరిన యువకుడు.. దారుణ హత్యకు గురైన ఘటన నగర పరిధిలోని 33వ డివిజన్‌ భట్టుపల్లి శివారు కోటచెరువు మత్తడి వద్ద జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..దర్గా కాజీపేటకు చెందిన పులిగిల్ల  చందు (20) నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లి వచ్చి రాత్రి దర్గా కాజీపేటలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లాడు.
   
  రాత్రి 11.30 గంటలకు చందు తల్లి నిర్మల, అక్క శ్వేత వినాయక మండపం వద్దకు వెళ్లి ఇంటికి రమ్మని పలువగా నిమజ్జనం తర్వాత వస్తానన్నాడు. రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి చందుకు పోన్‌ చేయగా సెల్‌ పని చేయలేదు. గురువారం ఉదయం భట్టుపల్లి గ్రామస్తులు కోటచెరువు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు మడికొండ ఎస్సై విజ్ఞాన్‌రావుకు సమచారం అందించారు. ఎస్సై సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి ప్యాంట్‌ జేబులో ఉన్న సెల్‌ పోన్‌ ఆధారంగా దర్గా కాజీపేటకు చెందిన చందుగా గుర్తించి తండ్రి ఏఆర్‌ కానిస్టేబుల్‌ యాదగిరికి సమచారం అందించారు.
   
  ఘటనా స్థలాన్ని కాజీపేట ఏసీపీ జనార్దన్‌, సీఐ ఎల్‌.రమేశ్‌బాబు పరిశీలించారు. మృత దేహంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్‌ టీం బృందం  అధారాలు సేకరించింది. కాగా చందుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ఎవరితోనూ శత్రుత్వం లేదని బంధువులు పేర్కొన్నారు. తంల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజ్ఞాన్‌రావు తెలిపారు.
   
   
మరిన్ని వార్తలు