సినిమాల్లో నటించాలనే కోరికతో..

12 Jan, 2016 11:56 IST|Sakshi
అమరనాథరెడ్డికి కేక్ తినిపిస్తున్న తల్లిదండ్రులు

సాక్షి, తాడిపత్రి: సినిమాల్లో నటించాలనే కోరికతో 21 ఏళ్ల కిందట ఇల్లు వదిలిన యువకుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చింది ఫేస్‌బుక్. ఇన్నేళ్ల తర్వాత తమ కొడుకు రావడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఆనందంతో బాణసంచా పేల్చి, బెలూన్లు ఎగరేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తమకు నిజమైన సంక్రాంతి ఇదేనని తల్లిదండ్రులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే...

వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన అన్నవరం రాఘవరెడ్డి, శేఖర్‌రెడ్డి, అంకిరెడ్డి అన్నదమ్ములు. వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల కిందట అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డారు. శేఖర్‌రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులకు అమరనాథరెడ్డి, రాజారెడ్డి, నందకుమార్‌రెడ్డి కుమారులు. వీరిలో అమరనాథరెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో 1994 అక్టోబర్ 15న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీకోసం కొన్నేళ్లపాటు తల్లిదండ్రులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఎప్పటికైనా తమ బిడ్డ క్షేమంగా తిరిగొస్తాడనే ఆశగా ఎదురు చూస్తున్నారు.

అమరనాథరెడ్డి ఎన్నో ప్రయత్నాల అనంతరం పలు సినిమాలు, సీరియళ్లలో విలన్ పాత్రలో నటించి రాణించాడు. దరువు, కాస్కో, శంకరాభరణం, మెంటల్‌కృష్ణ, శౌర్య సినిమాలతో పాటు మొగలిరేకులు, ఆడపిల్ల, జాబిలమ్మ సహా పలు సీరియళ్లలో అతను నటించాడు. అయితే నల్లగడ్డం, పెద్ద జుట్టు, సన్నగా పొడుగ్గా తలకు టోపీ పెట్టుకోని ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. అయితే బాబాయి అంకిరెడ్డి కుమారుడు హరీశ్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ఇంటిపేరు ‘అన్నవరం’ ఉండటాన్ని చూసి అమరనాథరెడ్డిని గుర్తించాడు.

అప్పటినుంచి ఇద్దరి మధ్య ఫేస్‌బుక్ పరిచయం పెరిగింది. ఆ తరువాత ఇద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో మూడు నెలల కిందట వారి మూలాలేమిటో తెలుసుకున్నారు. ఆ తరువాత అమరనాథరెడ్డి ఫోన్‌లో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చివరకు సోమవారం వారిని కలుసుకున్నాడు. 21 ఏళ్ల తర్వాత కొడుకు అనుకున్నది సాధించి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు.
 
దేవుడే కలిపాడు
ఇక మా బిడ్డ లేడనుకుని ఆశలన్నీ వదులుకున్నాం. ఇల్లు వదిలినప్పటి నుంచి ఎంత మానసిక వేదనకు గురయ్యామో చెప్పలేం. 21 ఏళ్ల తరువాత ఇంటికి రావడంతో ఆనందంగా ఉంది. దాన్ని మాటల్లో వర్ణించలేం. మమ్మల్ని దేవుడే కలిపాడు.
- శేఖర్‌రెడ్డి, వెంకటలక్ష్మి (అమరనాథరెడ్డి తల్లిదండ్రులు)
 
 ఇంత ఆనందాన్ని చూడలేదు
సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయా. అనుకున్నది సాధించా. అయితే సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిస్తే ఏమంటారోననే భయంతో సమాచారం ఇవ్వలేదు. చివరకు 21 ఏళ్ల తరువాత మా అమ్మానాన్న, కుటుంబ సభ్యులను కలుసుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది.  - అమరనాథరెడ్డి

మరిన్ని వార్తలు