తప్పతాగి.. అర్థరాత్రి యువకుల హల్ చల్

17 Aug, 2016 20:01 IST|Sakshi

తప్పతాగి వచ్చిన ఏడుగురు యువకులు అర్థరాల్రి బీభత్సం సృష్టించారు. స్థానిక యువకులు ఇద్దరిపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తిని కత్తితో పొడిచారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు... జెబాబాగ్ మురాద్‌నగర్‌కు చెందిన జిమ్ ట్రైనర్ ఎండీ యాసిన్(20), టోలిచౌకీకి చెందిన సేల్స్‌మన్ ఫుర్హాన్‌బేగ్ (18), చార్మినార్‌కు చెందిన విద్యార్థులు హేమంత్ శర్మ (20), నిఖిల్ శర్మ (21), ఆకాష్ శర్మ (23), టోలీచౌకికి చెందిన మొజం సిద్దిఖ్ (22), గోల్కొండకు చెందిన అఫాన్ (19) కలిసి మంగళవారం రాత్రి 11.30కి పాతబస్తీ నుంచి మూడు బైక్‌లపై జూబ్లీహిల్స్ రోడ్డు నెం.5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల రోడ్డు వద్ద ఉన్న కొంత మంది హిజ్రాల వద్దకు వచ్చారు.

 

అదే సమయంలో పక్కనే ఉన్న దుర్గాభవానీనగర్‌కు చెందిన శీను, వెంకటేష్‌లు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. తమ చేష్టలను శీను, వెంకటేష్ గమనిస్తున్నారని భావించిన ఏడుగురూ.. మీకు ఇక్కడేం పని? ఎందుకు నిలబడ్డారు.. బస్తీలోకి పొండి అని హెచ్చరించారు. మా బస్తీలో మేము నిలబడితే అడగటానికి మీరెవరంటూ శీను, వెంకటేష్ చెప్పగా ఆగ్రహం పట్టలేక ఏడుగురూ వీరిద్దరినీ చితకబాదారు. బాధితులిద్దరూ ప్రాణభయంతో పరుగు తీస్తూ బస్తీవాసులను అప్రమత్తం చేస్తుండగా.. మళ్లీ దాడి చేసేందుకు బస్తీలోకి వెళ్లారు.

 

బస్తీవాసి రమావత్‌సేత్యా వారిని అడ్డుకోబోగా వారిలో ఒకడు తమ వెంట తెచ్చుకున్న కత్తితో సేత్యా కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న సేత్యాను బస్తీవాసులు అపోలోకు తరలించారు. దుండగులంతా మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం నిందితులు ఏడుగురినీ అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు