పశువులను మేపేందుకు వచ్చి..

19 Aug, 2016 20:24 IST|Sakshi
పశువులను మేపేందుకు వచ్చి..
కాలువలో పడి యువకుడి దుర్మరణం
 
కొల్లూరు : పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌లో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కొల్లూరు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బంధువులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన అమర్తలూరి రమేష్‌ కుమారుడు వెంకటేశ్వర్లు (21) పశువులను మేపుకొచ్చేందుకు పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌ వైపు వచ్చాడు. కాల్వలో దిగిన పశువులు అవతలి ఒడ్డునున్న పొలాల్లోకి వెళ్లాయి. దీంతో వాటిని తోలుకొచ్చేందుకు దూరంలో ఉన్న కాలినడక వంతెన ద్వారా వెళ్ళాడు. పశువులను కాల్వలోకి తోలి అతను కూడా దిగాడు. ఆ ప్రాంతంలో కాల్వ బాగా లోతుగా ఉండటం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. నీటిలో కొట్టుకుంటుండగా పొలం పనులకు వెళ్ళి వస్తున్న కొల్లూరుకు చెందిన మహిళ గమనించి చుట్టుపక్కల వారిని పిలిచింది. ఈలోపే అతను మునిగిపోయాడు. అతనితో కలిసి వచ్చిన మరో యువకుడికి ఆ మహిళ విషయం చెప్పడంతో బంధువులకు సమాచారం అందించాడు. దీంతో బంధువులు వచ్చి ఈతగాళ్ల సహాయంతో కాల్వలో చాలాసేపు గాలించి రాత్రి 7 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇంటర్‌ వరకూ చదివిన వెంకటేశ్వర్లు తల్లిదండ్రులకు చేతికంది వచ్చి కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొల్లూరు ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించనున్నారు.
మరిన్ని వార్తలు