రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి అరెస్ట్

18 Nov, 2015 20:13 IST|Sakshi
రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి అరెస్ట్

విశాఖపట్నం: ఆమెకు 26 ఏళ్లు. చేసేది టీచర్ ఉద్యోగం. చట్టంపై కనీస అవగాహన లేదంటే పోలీసులకే నమ్మకం కుదరలేదు. పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్న ఆమెపై కేసు నమోదైంది. విశాఖపట్టణం సిరీపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన రమాదేవి(26) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనిలో తన వివరాలు పొందుపరిచింది. ఆ వివరాలు నచ్చడంతో విశాఖలోని సిరీపురానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్(29) ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. అలా 2012లో రమాదేవి- శ్రీనివాస్ ల వివాహం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే రమాదేవి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ అత్తారింటికి రాలేదు.

ఏళ్లపాటు ఎదురుచూసి విసిగిపోయిన శ్రీనివాస్.. నేరుగా రమాదేవి సొంతూరు పెద్దాపురం వెళ్లి ఆరా తీయగా.. ఆమెకు గతంలోనే అంటే 2003లోనే మరో వ్యక్తితో పెళ్లైందని, అతనితోనూ పడక విడిపోయిందని తేలింది. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. హిందూ వివాహచట్టం ప్రకారం మొదటి భర్తతో విడాకులు పొందిన తర్వాతే రెండో పెళ్లికి అనుమతి లభిస్తుంది. రెండు సందర్భాల్లోనూ రమాదేవి విడాకుల ఊసెత్తకపోవడాన్ని నేరంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రమాదేవితోపాటు ఆమె తండ్రిని కూడా బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు