ప్రభుత్వాసుపత్రిలో యువకుల విధ్వంసం

25 Mar, 2017 01:47 IST|Sakshi
ప్రభుత్వాసుపత్రిలో యువకుల విధ్వంసం
కొవ్వూరు : కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో పట్టణానికి చెందిన యువకులు కర్రలతో అద్ధాలు పగలకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శుక్రవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రెండు వర్గాల యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం యువకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. తమపై దాడి చేసి ఆసుపత్రికి వచ్చారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆరోపణతో మరో వర్గానికి చెందిన యువకులు ముకుమ్మడిగా ఆసుపత్రికి చేరుకున్నారు. కర్రలు పట్టుకుని ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్ధాలు పగలకొట్టారు. లోపలికి ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. ఆసుపత్రి బయట ఉన్న మోటారు సైకిళ్లను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌ఎస్‌వీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిని, రోగులను భయబ్రాంతులకు గురిచేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిబ్బంది మోటారు సైకిళ్లను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైద్య ఉద్యోగుల సంఘం నాయకురాలు హెప్సిబా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని నాయకులు, వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు.సీసీ కెమెరా పుటేజీలను సీఐ పరిశీలించారు.  
 
మరిన్ని వార్తలు