-

దసరా పందిరిలో యువకుల బీభత్సం

12 Oct, 2016 22:32 IST|Sakshi
యువకులు ధ్వంసం చేసిన గాజులు
* పూజ సామాగ్రి ధ్వంసం 
పక్కనే ఉన్న వైఎస్సార్‌ విగ్రహంపై రాళ్లు రువ్విన వైనం
పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు
 
నడికుడి (దాచేపల్లి): నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం పందిరిలో స్థానిక యువకులు కొందరు మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో  బీభత్సం సృష్టించారు. విగ్రహ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని పొందుగల వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్లిన తర్వాత 25 మందికి పైగా స్థానిక యువకులు ఆటోలో డీజే సౌండ్‌ సిస్టం పెట్టుకుని డ్యాన్స్‌లు చేసుకుంటూ పందిరి వద్దకు వచ్చారు. డీజేలో వస్తున్న పాటలకు  కేరింతలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న అమ్మవారి పందిరిలోకి వెళ్లారు. విగ్రహానికి పూజలు చేసేందుకు పందిరిలో ఉంచిన పూజ సామాగ్రిని చెల్లాచెదురుగా పడవేసి అమ్మవారి గాజులను పగులగొట్టారు. పందిరిలో ఉన్న పూలదండలను చింపి మురికికాలువలో పడవేశారు. అంతటితో ఆగకుండా పందిరి పైకి ఎక్కి ఈలలు వేసుకుంటూ గోల చేశారు. 
 
పక్కనే ఉన్న దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంపై యువకులు రాళ్లు రువ్వడంతో విగ్రహం పలు చోట్ల దెబ్బతింది. పందిరి పక్కనే ఉన్న కిరాణా దుకాణంపైకి కూడా ఎక్కి బీభత్సం సృష్టించారు. yీ జే సౌండ్‌ సిస్టం నిర్వాహకుడిపై కూడా యువకులు దాడి చేసి ఆటో అద్దాలను పగులగొట్టారు. ఇంతలో చుట్టుపక్కల వారు, కమిటీసభ్యులు అక్కడకు చేరుకోవడంతో వారిని చూసి యువకులు పరారయ్యారు. వారిలో ముగ్గురిని కమిటీ సభ్యులు పట్టుకున్నారు. జరిగిన సంఘటన గురించి సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్, కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కట్టా ఆనంద్‌ ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..
అమ్మవారి పందిరిలోని పూజ సామాగ్రిని ధ్వంసం చేసి వైఎస్సార్‌ విగ్రహంపై రాళ్లు రువ్విన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కమిటీసభ్యులు పల్లె వెంకటేశ్వరరెడ్డి, మైలా ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆళహరి శ్రీనివాస్, ఎస్‌ఐ ఆనంద్‌లను బుధవారం  కలిసి షేక్‌ హిదాయతుల్లా, షేక్‌ జానీ, షేక్‌ రఫీ, షేక్‌ గౌస్, షేక్‌ సుభానీలతో పాటుగా మరో 13 మందిపై ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తలు