డబ్బులు కాదు.. విలువలు పెంపొందించుకోవాలి

25 Sep, 2016 00:59 IST|Sakshi
డబ్బులు కాదు.. విలువలు పెంపొందించుకోవాలి
  •  యువతకు గోరేటి వెంకన్న దిశానిర్దేశం
  •  ఘనంగా కాకతీయ మహిళా డిగ్రీ  కళాశాల ‘మైత్రీ మీట్‌’
  • న్యూశాయంపేట : ప్రేమ, దయ, కరుణ అనే మహోన్నత విలువలకు సమాజం దూరమవుతున్న ప్రస్తుత తరుణంలో.. వాటిని అందిపుచ్చుకోవడంపై యువత దృష్టిసారించాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న సూచించారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల సీనియర్‌ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ‘మైత్రీ మీట్‌’ పేరిట ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. దీనికి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైత్రి అనేది మౌనంగా ఉంటుందని, మౌనంలో చాలా గొప్పశక్తి దాగి ఉంటుం‍దన్నారు. డబ్బులు ఎలా సంపాదించాలనే విషయం కాకుండా, నిజాయితీగా జీవించడం ఎలాగో నేర్చుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. అనంతరం కార్యక్రమ గౌరవ అతిథి ప్రముఖ రచయిత్రి, ఆంధ్రాబ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి అయిన ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. చదువుపైనే దృష్టిపెట్టి  ఉన్నత శిఖిరాలను అధిరోహించాలన్నారు. అనంతరం గోరేటి వెంకన్న ఆటపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్‌ గుండా హరినారాయణ, సెక్రెటరీ, కరస్పాండెంట్‌ మట్టెవాడ మాధవ్‌, ఎం.రవీందర్‌రెడ్డి, దయాకర్‌, ప్రిన్సిపాల్‌ మంజులా దేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరేటి వెంకన్నను కళాశాల యాజమాన్యం సన్మానించింది.
     
     
>
మరిన్ని వార్తలు