ప్రజల కోసం కేసులకై నా సిద్ధమే

23 Nov, 2016 01:21 IST|Sakshi
ప్రజల కోసం కేసులకై నా సిద్ధమే

- వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్   
- దివీస్ రసాయన పరిశ్రమ బాధితులకు పరామర్శ
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: తమ ప్రాంతంలో రసాయన పరిశ్రమ వద్దంటూ ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బాధితులకు అండగా నిలిచినవారిపై కేసులు పెట్టి వేధిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టించుకోవడానికై నా తాము సిద్ధమేనని తేల్చిచెప్పారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ రసాయన పరిశ్రమను వ్యతిరేకిస్తూ 85 రోజులుగా ఆందోళన చేస్తున్న తీర ప్రాంతంలోని 13 గ్రామాల ప్రజలకు ఆయన మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్ మంగళవారం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పరామర్శించారు. రసాయన పరిశ్రమ ఇక్కడ పెట్టకుండా చివరివరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివీస్ పరిశ్రమ వద్దని గొంతెత్తిన  ప్రతి ఒక్కరినీ పోలీసులు దారుణంగా హింసిస్తున్నారని బాధితులు కన్నీరు పెట్టుకోవడంతో జగన్ చలించిపోయారు. అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోందని నిలదీశారు. దానవాయిపేట పంచాయతీ నర్సిపేటలోజరిగిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసమూహాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే....

 ‘‘కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీ మనకు వద్దూ అంటూ గత 82 రోజులుగా ఉద్యమ బాట పట్టినా, ఈ పరిశ్రమ వల్ల వాటిల్లే నష్టాలను ఏకరువు పెట్టినా వినని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా బాధితులకు తోడుగా వచ్చి ఎవరైనా అండగా నిలిస్తే... బాధితుల కష్టాలను వివరిస్తే పెట్టని కేసు లేదు. ఇక్కడి గ్రామాల్లో 82 రోజులుగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచినందుకు, వారి సమస్యలను ఎలుగెత్తి చాటినందుకు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై 22 కేసులు పెట్టారు. ఇందులో 7 కేసులు హత్యయత్నం కేసులట! అసలు హత్యాయత్నం కేసులంటే వీళ్లకు(ప్రభుత్వ పెద్దలకు) తెలుసా? బాధితుల పక్షాన నిలిస్తే దారుణంగా వేధిస్తున్నారు. దివీస్ బాధిత ప్రజలకు తోడుగా నిలిచేందుకు వచ్చిన సీపీఎం సీనియర్ నేత పి.మధును పోలీసులు కొట్టి, వ్యాన్‌లోకి ఎక్కించారు. నన్ను దారుణంగా కొట్టారు, కొట్టి వేధించారు, ఇక్కడికొస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ రాస్తే పట్టించుకునే దిక్కు లేదు. మహిళలని కూడా చూడకుండా హింసించారు. పైగా కేసులు పెట్టి వేధించారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి ప్రజలు ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల వారి బతులు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో రాష్ట్రమంతటా తెలియజెప్పాలి. దాంతో చంద్రబాబు మనసు మారాలి. ఈ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్న యాజమాన్యం మనసు మార్చుకొని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి రావాలి. చంద్రబాబు గూబ అదిరేలా, ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలను, కష్టాలను గట్టిగా వినిపిద్దాం.

 ఇలాంటిది ఆసియాలోనే లేదు
 ఈ ప్రాంతం నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో దాదాపు 250 హ్యాచెరీలు(రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) ఉన్నాయి. ఒక్కో హ్యాచెరీ దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంటే 25,000 మంది వీటిలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒకేచోట 250 హ్యాచెరీలు ఉన్న జోన్ దేశంలో, ఆసియా ఖండంలో ఎక్కడా లేదు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల వల్ల దేశానికి ఏటా రూ.33,000 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ఇందులో రొయ్యల(ఆక్వా కల్చర్) ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం రూ.23,000 కోట్లు. ఆక్వా కల్చర్‌తో మన రాష్ట్రానికి ఏటా వస్తున్న ఆదాయం రూ.14,000 కోట్లు. ఇక్కడ హ్యాచెరీల్లో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తేనే వాటిని బయట చెరువుల్లో పెంచగలుగుతాం. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే రొయ్య పిల్లలో సగం సీడ్ ఈ ప్రాంతం నుంచే వస్తోందంటే దీని ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, ఈ రంగంలో పనిచేస్తున్న కూలీలకు మేలు జరగాలి, ఇక్కడున్న హ్యాచెరీల్ని కాపాడాలన్న యోచనను ప్రభుత్వం చేయాలి.

 65 లక్షల లీటర్ల నీరంటే ఎంతో తెలుసా?
 రొయ్య పిల్లలు సున్నితమైన వాతావరణంలోనే బతుకుతారుు. సముద్రపు నీళ్ల ద్వారానే అవి జీవిస్తారుు. అందుకే సముద్రపు నీళ్లు ఉన్న చోటే హ్యాచెరీలను స్థాపిస్తారు. ఈ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే సముద్రపు నీటిలోకి కలుషితమైన నీటిని పంపిస్తుంది. నిత్యం 65 లక్షల లీటర్ల మంచి నీటిని ఉపయోగించుకుంటుంది. 55 లక్షల లీటర్ల కలుషిత నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంది. 65 లక్షల లీటర్ల నీరంటే ఎంతో తెలుసా? వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో ఒక రోజు ఉపయోగించుకునే నీరు 60 లక్షల లీటర్లు. అంటే ఒక మున్సిపాలిటీ ఉపయోగించుకునే నీటి కంటే ఎక్కువ నీటిని ఈ రసాయన పరిశ్రమ వాడుకుంటుంది. నిత్యం 55 లక్షల లీటర్ల కలుషిత నీరు సముద్రంలో కలిస్తే మత్స్య సంపద పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే పరిస్థితి ఉండదు. హ్యాచరీలు మనుగడ సాగించలేవు. మత్స్యకారులు ఇప్పటికే సముద్రంలో 15 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కలుషిత నీరు అందులో కలిస్తే ఇంకా ఎంతదూరం వెళ్లాలో తెలియదు. ఇక్కడ హ్యాచెరీలు బతకాలంటే, అందులో 25 వేల మంది ఉద్యోగాలు నిలబడాలంటే, దేశానికి ఏటా రూ.23 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం రావాలంటే సముద్రపు నీళ్లు కావాలి. ఆ ఫ్యాక్టరీ మాత్రం కలుషిత నీటిని పంపించడానికే సముద్రపు నీరు కావాలనుకుంటోంది. ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తూ ఇక్కడి ప్రజలు 82 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు.

 అది మేలో, కీడో ఆలోచించాలి
 ఫ్యాక్టరీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే సంగతి అందరికీ తెలుసు. కానీ, ఒక ఫ్యాక్టరీ వల్ల 25,000 మంది ఉద్యోగాలు పోతున్నాయంటే దానివల్ల జరిగేది మేలో, కీడో అందరూ ఆలోచించాలి. ఇక్కడి నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఉంది. దివీస్ సంస్థకు సంబంధించిన ఇదే ఫార్మాస్యూటికల్ యూనిట్‌ను అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరేం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇష్టమొచ్చినట్లుగా రసాయన పరిశ్రమకు భూములిచ్చేస్తోంది. దివీస్‌కు ఇక్కడే భూములెందుకు ఇస్తున్నారంటే.. ఇక్కడ ఎకరా రూ.35 లక్షలు పలుకుతోంది. దివీస్‌కు మాత్రం ఎకరా కేవలం రూ.5 లక్షల చొప్పున దాదాపు 670 ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారు. అతి తక్కువ ధరకు రైతుల నుంచి భూములు లాక్కొని దివీస్‌కు అప్పగిస్తున్నారు. ఆ భూముల వాస్తవ ధర రూ.250 కోట్లకు పైగానే ఉంటుంది. దివీస్‌కు వాటిని కేవలం రూ.30 కోట్లకే కట్టబెడుతున్నారు. మిగిలిన సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు, దివీస్ కలిసి పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. రైతులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. ఇదే దివీస్ కంపెనీ ఫార్మాసిటీలో యూనిట్ ఎందుకు పెట్టడం లేదంటే.. అక్కడ ఎకరాకు రూ.60 లక్షలో, రూ.70 లక్షలో చెల్లించాలి. అక్కడ కార్యకలాపాలు సాగించాలంటే నెలనెలా ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చులన్నీ తగ్గించుకునేందుకే ఇక్కడకొచ్చి భూములను అప్పనంగా కొట్టేస్తూ మన ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు.

 స్వార్థంతో అమ్ముడుపోతున్నారు
 అధికారం ఉందనే ధీమాతో చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండున్నరేళ్లలో ఆయన ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. ఎవరు ఎలా నష్టపోరుునా ఫర్వాలేదు, నాకు వచ్చేది నాకొచ్చేస్తే చాలని ఆయన అనుకుంటున్నారు. వందలాది హ్యాచెరీలు మూతపడే దుస్థితి నెలకొన్నా కేవలం వ్యక్తిగత స్వార్థంతో అమ్ముడుపోతున్నారు. దివీస్ సంస్థకు ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా.. చంద్రబాబుతో మీకున్న లావాదేవీల సంగతి నాకు తెలియదు. కానీ, ఒక్కటే చెబుతున్నా. ఒక పరిశ్రమ వల్ల తమకు మేలు జరగుతుందని ప్రజలు భావిస్తేనే ఆ పరిశ్రమ దేదీప్యమానంగా వెలుగొందుతుంది. చంద్రబాబుతో మీకున్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా డీల్ కుదుర్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ధర్మం కాదు. మీరు ఫ్యాక్టరీ పెట్టి కలుషిత నీటిని సముద్రంలోకి వదిలితే ఇక్కడ గ్రామాలుండవు, మత్స్యసంపద ఉండదు, మత్స్యకారులు ఉండరు. హ్యాచెరీలు ఉండవు. దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్న ఈ వ్యవస్థను నాశనం చేయొద్దని దివీస్ యాజమాన్యాన్ని కోరుతున్నా. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఫార్మాసిటీలో మీ పరిశ్రమ పెట్టుకోండి. అప్పుడు అందరమూ స్వాగతిస్తాం. దీనివల్ల రాష్ట్రానికి, మీకు మంచి జరుగుతుంది. చంద్రబాబు అండ ఉందనే మొండి వైఖరితో ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోం. కచ్చితంగా పోరాడుతాం. ఇక్కడున్న ప్రజలకు తోడుగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మహాఅరుుతే ఇంకో రెండేళ్లు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మేమొచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని ఇక్కడినుంచి తరలిస్తాం.

 కేసులకు సిద్ధమే...
 పోలీసు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వేసుకున్న యూనిఫామ్‌ను గౌరవించండి. నెత్తిన టోపీపై ఉన్న సింహాలను గౌరవించండి. కానీ, ఆ సింహాల వెనుక ఉన్న గుంటనక్కలు ఆడించినట్టల్లా ఆడకండి అని కోరుతున్నాం. మీ మనస్సాక్షి చెప్పినట్లుగా మీరు వినండి. ఇక్కడి బాధితులకు అండగా నిలవండి. ప్రజలకు అండగా ఉన్న ఎమ్మెల్యే రాజాపై ఇప్పటికే 22 కేసులు పెట్టారు. ఇంకో 22 కేసులు పెట్టించుకోవడానికై నా సిద్ధమే. అవసరమైతే రాజాతోపాటు నేను కూడా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బాధితులకు అన్నిరకాలుగా తోడుగా ఉంటాం. మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం మీకు తోడుగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పిఎసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బారుు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, గొల్ల బాబూరావు పాల్గొన్నారు.