రైతు గోడు పట్టదా!

15 Apr, 2017 17:26 IST|Sakshi
రైతు గోడు పట్టదా!

► సర్కారుపై మండిపడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
► ఎండిపోతున్న చీనీతోటలను పరిశీలించిన ప్రతిపక్ష నేత
►  అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి..
► పులివెందుల, సైదాపురంలో పలు కుటుంబాలకు పరామర్శ
► వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన పలు కుటుంబాలు


సాక్షి, కడప:  వాన నీరు లేక కరువు కరాళ నృత్యం చేస్తున్న వేళ... దంచి కొడుతున్న ఎండలకు బోరు బావుల్లోంచి చుక్క నీరు రాక.. పచ్చని చెట్లు నిలువునా మాడిపోయాయి.. వెరసి పంటలు కాపాడుకోలేక.. కన్నబిడ్డల్లా సాకిన చెట్లు ఎండిపోవడం చూడలేక రైతన్నలు కుంగిపోతున్నారు.. రైతన్న పడుతున్న ఈ కష్టాలను స్వయంగా పరిశీలించిన  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ఇంతటి విపత్కర పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు సర్కారుకు కనీస మానవత్వం లేదని మండిపడ్డారు.  పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన  ఆయన శుక్రవారం మధ్యాహ్నం చీనీ తోటలను పరిశీలించారు. మండు వేసవి.. కరెక్టుగా 2గంటల సమయం.. వాడుతున్న, ఎండుతున్న చీనీ చెట్లను పరిశీలిస్తూ ఒకవైపు.. మరోవైపు మీడియా ప్రతినిధులకు చూపిస్తూ రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరించారు. నీరులేక.. కృష్ణ జలాలు రాక రైతుల చీనీ చెట్లు ఎండుతున్న పరిస్థితిని రైతులు వివరించగా.. విన్న ప్రతిపక్షనేత తోటలను పరిశీలిస్తున్న సందర్భంలో ఎండిన చెట్లను చూసి చలించిపోయారు. ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రైతు ఈశ్వరరెడ్డి తోటకు అయిన పెట్టుబడులు, బోర్లు, నీటి విషయమై వైఎస్‌ జగన్‌రెడ్డి చర్చించారు.

పసుపు రైతుల గోడును పట్టించుకోని ప్రభుత్వం : పసుపు ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఖాజీపేట మండలం సన్నపల్లె గ్రామానికి చెందిన పసుపు రైతులు రవీంద్రనాథరెడ్డితోపాటు మరొక రైతు పసుపు కొమ్మలను తీసుకొచ్చి చూపించారు. గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో క్వింటా పసుపు రూ.16వేలు ధర పలకగా.. ప్రస్తుతం రూ.4.500లు మాత్రమే పలుకుతోందని.. ఇలా అయితే ఎలా గిట్టుబాటు అవుతుందని వారు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పులివెందులలోని నారాయణ స్కూలు సమీపంలో అంబకపల్లె బాబు ఇంటి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు వచ్చి కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం మిర్చి, పసుపు రైతులను గాలికి వదిలేసిందని.. రైతులకు సంబంధించి స్థిరీకరణ నిధి పెట్టినా.. పట్టించుకోలేదని తెలియజేశారు. రానున్న కాలంలో రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతానని ఆయన తెలిపారు.

అంబేడ్కర్‌కు నివాళి.. : పులివెందులలోని ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌తోపాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

పార్టీలో చేరిన పలు కుటుంబాలు : జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం రామచంద్రాపురం, జమ్మలమడుగు మండలం మాధవపురం, గండికోట తదితర గ్రామాలకు చెందిన దాదాపు 60నుంచి 80కుటుంబాలు శుక్రవారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దొన్నవాడ మహేశ్వరరెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్, సింగిల్‌ విండో శివగురివిరెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. అనంతరం పులివెందుల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమ సమీపంలో టీడీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో మమేకం: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న ఇంట్లో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో వైఎస్‌ జగన్‌ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు ఇళ్లు కూడా కిక్కిరిసింది. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పేరు, పేరునా కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పులివెందులకు చెందిన ఆకుల సుభాష్, నెల్లూరుకు చెందిన చైతన్యలు రూపొందించిన మిషన్‌–2019 గ్రూపుకు సంబంధించి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు వివరించారు.  

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు: పులివెందులలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం పలువురు నేతలు కలిశారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితోపాటు మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి  అనేక అంశాలపై చర్చించారు. అలాగే జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డిలు కలిసి చర్చించారు.

>
మరిన్ని వార్తలు