మోసం కాదు.. మేలు చెయ్..

2 Jun, 2016 03:18 IST|Sakshi
మోసం కాదు.. మేలు చెయ్..

సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు

- ‘అనంత’లో మొదలైన ఐదో విడత రైతు భరోసా యాత్ర
- బంగ్లాలో కూర్చొనిరాష్ట్రం బాగుందని అబద్ధాలు చెబితే సరిపోదు
- మీ మాటలు నమ్మినందుకు రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి
- పల్లెల్లో రైతు కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో చూడు
- ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు
- ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు చెల్లిస్తున్నారు.. ఆ డబ్బంతా ఎక్కడిది?
- శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు?
- రైతులు, డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి    
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘రైతు, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం... ఉద్యోగం రానివారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రెండేళ్లయ్యింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆయన మోసపూరిత మాటలు నమ్మి, రుణాలు మాఫీ కాక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నాయి. చంద్రబాబు మాత్రం ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అసెంబ్లీలో ఊదరగొడుతున్నారు. బంగ్లాలో కూర్చొనిరాష్ట్రం బాగుందని అబద్ధాలు చెబితే సరిపోదు.

ఇప్పటికైనా బుకాయించడం మానుకో, పల్లెల్లోకి వచ్చి రైతు కుటుంబాలు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో చూడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్ జగన్ ఐదో విడత రైతు భరోసా యాత్రను బుధవారం అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తొలిరోజు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలంలో పర్యటించారు.  చిన్నవడుగూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నాగ సంజీవప్ప అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత దిమ్మగుడిలో నాగార్జునరెడ్డి, చింతలచెరువులో వెంకటనారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. తొలుత పెద్దవడుగూరు మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ఏం చెప్పారంటే...

 ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా?
 ‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, సంతోషంగా ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఊదరగొడుతుంటే... ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? మీ మోసపూరిత వైఖరితోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీ కంటికి కనిపించలేదా? అని గట్టిగా నిలదీశా. బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. బంగారం మాత్రం ఇంటికి రాలేదు. రుణ మాఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు.. ఇలా అందరినీ మోసం చేసి, పంగనామాలు పెట్టారు. బాబు నిర్వాకం వల్ల రైతులు 18 శాతం అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారు. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ సైతం రావడం లేదు. అనంతపురం జిల్లా నుంచి దాదాపు 5 లక్షల మంది రైతులు వలస వెళ్లారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం కేంద్రం నుంచి ఏటా రూ.500 కోట్లు వస్తుంటే... రాష్ట్రంలో ప్రజలకు పనులు కల్పించకుండా ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. వలసల నివారణకు కనీసం ఉపాధి హామీ పనులు కూడా కల్పించలేకపోతున్నారు. ఇంతకంటే దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్ల దాకా ఇస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? అదంతా అవినీతి సొమ్ము కాదా?’’  
 
 యాడికి కాలువకు నీళ్లేవీ?
 ‘‘తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.600 కోట్లతో యాడికి కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన హయాంలో కాలువ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఆ కాలువకు నీళ్లివ్వలేదు.  చంద్రబాబు హయాంలో కాలువలకు నీళ్లు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల నుంచే నీళ్లు తీసుకెళుతుంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది? ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మోసం చేయడం మానుకోవాలి. ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు రావాలి’’ అని జగన్ సూచించారు. పెద్దవడుగూరు మండల కేంద్రంలో ప్రతిపక్ష నేత నిర్వహించిన ముఖాముఖిలో పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు