చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా?

30 Sep, 2015 15:21 IST|Sakshi
చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా?

టంగుటూరు :  అధికారంలోకి వస్తే అన్ని రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద ఆయన బుధవారం ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రం చీమ కుట్టినట్లు అయినా లేదని  మండిపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది పొగాకు విస్తీర్ణం తగ్గిందని, విస్తీర్ణం తగ్గినప్పుడు రేటు పెరగాల్సిందిపోయి ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి ...పొగాకు లో గ్రేడ్కు కూడా కేజీకి కనీసం రూ.67 ఇస్తామని ప్రకటించారని, ప్రస్తుతం టంగుటూరు పొగాకు కొనుగోలు కేంద్రం కేజీ రూ.34 కొంటుందన్నారు. పొగాకు పండించడానికి 3 నెలలు పడితే అమ్ముకోవడానికి 10 నెలలు పడుతోందన్నారు.

పొగాకు రంగు మారితే ధర తగ్గిపోతుందని, దీంతో రైతులకు కనీస మద్దతు ధర కూడా పలకదన్నారు. ఈ విషయాలను చూస్తుంటే చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా అనే అనుమానం కలుగుతోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.  జనవరి నుంచి జూన్ వరకూ ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసి 30 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి ఉంటే ఈ రోజు రేటు తగ్గేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 

పొగాకు కొనడానికి వ్యాపారులు ముందుకు వచ్చేవారని, రైతులకు న్యాయం జరిగేదన్నారు. 67 రూపాయలకు తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేసిన పొగాకుకు వారు నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖఱి దారుణంగా ఉందని, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రైతుల పక్షాన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, నష్టపోయిన రైతుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

మిగతా పంటలు పండిస్తున్న రైతుల కూడా కనీస మద్దతు ధర లేక అల్లాడుతున్నారన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా  కళ్లు తెరిచి  ఆదుకోవాలని ఆయన సూచించారు. పొగాకుతో పాటు పామాయిల్, పత్తి, పసుపు, చెరకు, మొక్కజొన్న, సుబాబుల్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.  ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతులకు దక్కిది మాత్రం నామామాత్రమేనన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు.  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి, మెడలు వచ్చి అనుకున్నది సాధిద్దామని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు