1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

28 Jul, 2016 03:32 IST|Sakshi
1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

1, 2 తేదీల్లో నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు.. 3న యువభేరి

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 1 నుంచి 3 వరకూ నెల్లూరులో పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలసి బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1న, అలాగే 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. 3వ తేదీన కస్తూరి దేవి గార్డెన్స్‌లో యువభేరి కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గాల సమీక్షకు పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరవుతారని, యువభేరికి విద్యార్థులు, ప్రజలు హాజరుకావాలని వారు కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ తొలినుంచీ పోరాటం చేస్తున్నార న్నారు. కాగా అనిల్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను నేతలు పరిశీలించారు.

 అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరి
 సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరకు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు