వైఎస్ జగన్ నన్ను కుటుంబ సభ్యుడిలా చూశారు

2 May, 2016 17:10 IST|Sakshi

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూశారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీలో తాను టాప్ 3లో ఒకడిగా ఉన్నానని, వైఎస్ కుటుంబంపై ప్రేమాభిమానాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆయన చెప్పారు. ఏపీలో పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నట్లుగా వైఎస్ జగన్‌కు అహంకారం లేదని ఆయన అన్నారు. అయితే.. ప్రేమాభిమానాలు వేరు, ప్రాంతాల అభివృద్ధి వేరని ఆయన చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నందువల్లే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసినా, ప్రతిపక్ష నేతగా, ఏపీ ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, అందుకే తాను తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వైఎస్ఆర్ జలయజ్ఞం ద్వారా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేస్తున్నారని అన్నారు. అందుకే బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నానన్నారు.

దీక్ష బాధాకరం
పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ దీక్ష చేయాలనుకోవడం బాధాకరమని తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఏపీ ప్రాంత ప్రయోజనాలు వైఎస్ జగన్‌కు ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తమకూ అంతే ముఖ్యమని, అందుకే తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ నేతలను టీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు