పెదగొట్టిపాడు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

27 May, 2016 16:37 IST|Sakshi
పెదగొట్టిపాడు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

గుంటూరు: ఇటీవల గుంటూరులో మట్టిపెళ్లలు విరిగిపడి మృతిచెందినవారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో సునీల్, ప్రశాంత్, సలోమన్, రాజేష్, శేషుబాబు, సుధాకర్, రాకేష్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో  ఆయనకు పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన  పెదగొట్టిపాడుకు బయల్దేరారు. వెటర్నరీ కళాశాల వద్ద విద్యార్థుల దీక్ష శిబిరాన్ని వైఎస్ జగన్ సందర్శించి, మద్దతు ప్రకటించారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని అన్నారు.

గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ కొద్దిసేపు తాడేపల్లిలో ఆగారు. ఈ సందర్భంగా కేఎల్ రావు నగర్ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎక్స్ప్రెస్ హైవే పేరుతో తమ ఇళ్లను తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా ప్రత్తిపాడు జనంతో కిక్కిరిసిపోయింది. ఆయన రాకకోసం పెద్ద ఎత్తున జనం ఎదురుచూస్తూ రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్భంగా జననేత స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్, జగజ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెదగొట్టిపాడు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు