మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి

25 Dec, 2015 03:51 IST|Sakshi
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి

* వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళి  
* ఓపెన్ చర్చిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలసి క్రిస్మస్ ప్రార్థనలు

సాక్షి, కడప: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కొద్దిసేపు మౌనంగా అక్కడే మోకరిల్లారు. సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, బ్రదర్ అనిల్, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కూడా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, భారతమ్మలు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇడుపులపాయలోని ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏటా క్రిస్మస్‌కు ముందురోజు వైఎస్సార్ కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో కలసి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి, వైఎస్ సోదరులు వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దంపతులు, వైఎస్ భాస్కర్‌రెడ్డి దంపతులు, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి దంపతులు, ఇతర కుటుంబసభ్యులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రెవరెండ్ ఫాదర్ నరేష్, బెనహర్‌బాబు, మృత్యుంజయ తదితర ఫాస్టర్లు క్రిస్మస్ పర్వదిన విశిష్టతను వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని వారు ప్రార్థించారు.

ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జగన్
ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం ప్రొద్దుటూరుకు వెళ్లిన వైఎస్ జగన్‌కు పట్టణ శివారులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు ముక్తియార్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరికీ వైఎస్ జగన్.. మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు