‘నోట్ల రద్దు’ లోపాలు సరిదిద్దండి

24 Nov, 2016 01:28 IST|Sakshi
‘నోట్ల రద్దు’ లోపాలు సరిదిద్దండి

- అంతవరకు నిర్ణయం వాయిదా వేయండి: ఏపీ ప్రతిపక్ష నేత జగన్
- అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి నిర్ణయాలైనా విఫలమే
- పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే రద్దు నిర్ణయాన్ని అమలు చేయాలి
- ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామంటే ఎలాంటి తేడా జరగదు
- చలామణిలో ఉన్న నగదు ఎక్కడికీ పోదు
- కూలీలకు కార్డులిచ్చి స్వైపింగ్ చేయమంటారా?
- రద్దుపై చంద్రబాబుకు ముందే తెలుసు.. ఆయన అంతా సర్దుకున్నారు
- హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారు
- అప్పుడు మోదీని పొగిడారు.. ఇప్పుడు విమర్శిస్తున్నారు
- జనం తిడుతున్నారనే చంద్రబాబు ప్లేటు మార్చారు
 
 సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను కష్టాల పాల్జేస్తున్న పెద్ద నోట్ల రద్దు విషయంలో లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందస్తు కసరత్తు లేకుండా, ప్రజల ఇబ్బందులను అంచనా వేయకుండా 86 శాతం కరెన్సీని ఎలా రద్దు చేస్తారని ఆయన నిలదీశారు. సామాన్యుల దగ్గర కొద్దోగొప్పో ఉన్న సొమ్ము నల్లధనం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రకాలుగా లోపాలను సవరించిన తరువాతే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయాలని, అప్పటిదాకా వాయిదా వేయాలని కోరారు. ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామని చెబితే ఎలాంటి తేడా జరగదని స్పష్టం చేశారు. ప్రజలను నోట్ల కష్టాల నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలుసని చెప్పారు. ఆయన అప్పటికే అంతా సర్దుకున్నారని ఆరోపించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే...

 ‘‘పెద్ద నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు అందరి అభిప్రాయాలను తెలుసుకొని, దాని అమలుకు అవసరమైన సదుపా యాలన్నీ సిద్ధం చేసుకుంటారని అనుకుంటాం. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక నిర్ణయం వెలువడింది. తాను లేఖ రాశాను కాబట్టే ఈ నిర్ణయం వెలువడిందని ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయడం మంచిదేనని ఎవరైనా అనుకుంటారు. వ్యవస్థ బాగు పడాలంటే నల్లధనం నామరూపాల్లేకుండా పోవాలని భావిస్తాం. అవినీతి, బ్లాక్ మార్కెటింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్, నకిలీ నోట్ల దందా ద్వారా పేరుకుపోతున్న నల్లధనాన్ని పూర్తిగా అరికడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది మంచి నిర్ణయమేనని అందరమూ అనుకున్నాం. సామాన్యుల ప్రమేయం లేకుండానే ఈ నిర్ణయం వెలువడింది. ఇవాళ పరిస్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్పడం లేదు. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు. ప్రభుత్వ ఆలోచనలు బాగున్నాయని ప్రజలంతా అంటే వారికి తోడుగా బాగుందంటాం. బాగోలేవని ప్రజలు చెబితే వారి తరఫున వ్యతిరేకిస్తాం.

 ఎవరికీ తెలియకుండా రద్దు చేయడం నిజమేనా?
 మంచి ఉద్దేశాలతో బయటకు వచ్చిన ప్రణాళికలు కూడా అమలు సరిగ్గా లేకపోతే విఫలమవుతాయని మనకు చరిత్ర చెబుతోంది. గతాన్ని గమనిస్తే కొన్ని చరిత్రాత్మకమైన నిర్ణయాలు జరిగారుు. ఉదాహరణకు యూఎస్‌ఎస్‌ఆర్(యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) అధ్యక్షుడిగా గోర్బచేవ్ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమేమిటో తెలుసా? అప్పుటి వరకు సోషలిస్టు ఎకానమీలో ప్రయాణిస్తున్న యూఎస్‌ఎస్‌ఆర్‌లో సరళీకరణ విధానాలను అమలు చేయాలనే విప్లవాత్మకమైన ఆలోచన గోర్బచేవ్ చేశారు. ఓపెన్ మిషన్ ట్రాన్‌‌సఫరెన్సీ దిశగా అడుగులు వేరుుంచారు. 15 దేశాలు ఉన్న యూఎస్‌ఎస్‌ఆర్ ఈ నిర్ణయాల వల్ల పూర్తిగా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఆలోచనలు గొప్పవే కానీ అమలు సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణం. సక్రమంగా అమలు చేయలేనప్పుడు నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ వ్యవహారాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా నోట్లను రద్దు చేశామని కేంద్రం చెబుతోంది. అది నిజమేనా?