రథోత్సవంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

22 Apr, 2016 00:43 IST|Sakshi
రథోత్సవంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని రథోత్సవం గురువారం కనుల పండువగా సాగింది. తొలుత ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై ఆసీనులను చేశారు. భక్తుల రామనామ స్మరణమధ్య ఉదయం 9 గంటలకు రథశాల నుంచి రథం ముందుకు కదిలింది. భక్తు లు ఎండను సైతం లెక్క చేయకుండా రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. రాముల వారు సీతాలక్ష్మణ సమేతంగా రథంపై పురవీధుల్లో ఊరేగారు. రథం తిరిగి సాయంత్రం 5 గంటలకు రథశాలకు చేరుకుంది.
 
రథోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం రథోత్సవంలో పాల్గొన్నారు. కడపకు హెలికాఫ్టర్‌లో వచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్న వైఎస్ జగన్.. తొలుత రథం వద్ద కొబ్బరి కాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతసేపు రథాన్ని లాగారు. అనంతరం కోదండ రామాలయంలోకి వెళ్లారు. టీటీడీ డిప్యూటీ ఈవో బాలాజీ, అర్చకులు పూర్ణ కుంభంతో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. తొలుత ధ్వజ స్తంభం, బలిపీఠానికి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించారు.

స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగ మండపంలో వైఎస్ జగన్‌ను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. జగన్ వెంట కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీని వాసులు, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప మేయ ర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపాటి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు