ఉత్సాహంగా రెండోరోజు జగన్‌ పర్యటన

10 Aug, 2017 11:09 IST|Sakshi
ఉత్సాహంగా రెండోరోజు జగన్‌ పర్యటన

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం నూనెపల్లె నుంచి రోడ్‌ షో ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందోహం నడుమ ఆయన రెండో రోజు రోడ్‌ షో మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన చాబోలు చేరుకున్నారు. జననేతకు చాబోలులో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగనన్నపై పూలవర్షం కురిపించారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు జనం పోటీ పడ్డారు. మహిళలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. స్థానిక సమస్యలను సామరస్యంగా వింటూ, ఓపిగ్గా అందరినీ పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ రోడ్‌ షో కొనసాగిస్తున్నారు. జగన్‌ రోడ్‌ షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అయ్యలూరు వరకూ ఈ రోజు రోడ్‌ షో సాగుతుంది.

వైఎస్‌ జగన్‌ రోడ్‌ షోకు మంచి స్పందన వస్తోందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు. నంద్యాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనబడుతోందని, అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. నంద్యాలకు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల్లేవంటూ నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికలు రావడంతో హడావుడిగా పనులు మొదలు పెట్టారని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.