మీ మేలు ‘అనంత’మ్

1 Sep, 2016 23:20 IST|Sakshi
మీ మేలు ‘అనంత’మ్

►  రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలో చూపించిన నేత
►  ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా ఉండాలో నేర్పించిన మహానేత
►  ‘అనంత’ అభివద్ధి కోసం అనుక్షణం తపించిన దార్శనికుడు
►  నేడు వైఎస్‌ ఏడో వర్ధంతి...ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ఏర్పాట్లు

కరువు ప్రజల కన్నీటిని తుడవడానికి హంద్రీ–నీవాను చేపట్టావు... ‘కష్ణమ్మ’ను ‘అనంత’ ముంగిటకు తీసుకొచ్చావు.. ప్రజల దాహార్తి తీర్చావు.. అన్నదాతలను ఆదుకున్నావు.. రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపావు.. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లతో ఎందరికో పునర్జన్మ ప్రసాదించావు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో మరచిపోలేని మంచి పనులు చేశావు.. రాజన్నా! మీ మేలు ‘అనంత’ం. మిమ్మల్ని మరవం జీవితాంతం.


కేవలం మాటలు చెబుతూ జిల్లా అభివద్ధిని విçస్మరించిన నేతలు..శంకుస్థాపలు చేసి కన్నెత్తి చూడని నేతలను ‘అనంత’ వాసులు చూశారు. మాటలు కాకుండా చేతల్లో కష్ణమ్మను జిల్లాకు రప్పించేందుకు హంద్రీ–నీవాను చేపట్టి ‘అనంత’ను సస్యశ్యామలం చేసిన నాయకుడు...అప్పుల ఊబిలో కూరుకుపోయిన వేరుశనగ రైతుకు పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న నాయకుడిని గుండెల్లో పెట్టుకున్నారు. సొంత జిల్లా వైఎస్సార్‌ జిల్లా కంటే అనంత అభివద్ధి కోసమ పరితపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. రాజకీయాల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి...పరిపాలనలో సీఎం అంటే ఇలా చేయాలని అని చూపిన నిజమైన లీడర్‌ వైఎస్‌. వైఎస్‌ ఏడో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

వైఎస్‌ ముఖ్యమంత్రికి బాధ్యతలు తీసుకున్నప్పటి రోజుకు ‘అనంత’ ఓ భయానక వాతావరణంలో ఉంది. వ్యవసాయం పూర్తిగా అటకెక్కింది. జిల్లాలో పంటలకు బదులు ఆత్మహత్యలు సాగవుతున్నాయా? అనేలా భయంకర పరిస్థితులు. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడుతుంటే గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడిన పరిస్థితి. గడ్డిలేక పశువులను కబేళాలకు తరలించిన పరిస్థితి. ఉపాధి లేక ఊళ్లకు ఊళ్లు వలసెళ్లిన స్థితి.

ఈ పరిస్థితుల్లో 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ బాధ్యతలు స్వీకరించారు. తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించారు. హంద్రీ–నీవా పనులను ప్రారంభించారు. తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్‌ కోటా అయిన పది టీఎంసీలను రివర్స్‌ డైవర్షన్‌ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ  2005 ఆగస్టు 14 న ఉత్తర్వులు జారీచేశారు. ఆ క్రమంలో రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టారు.  శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా హిందూపురం, మడకశిర, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకర్గాల ప్రజలకు మంచినీరు అందించారు.అనంతపురం కార్పొరేషన్‌ దాహార్తిని తీర్చేందుకు రూ.67 కోట్ల ముద్దలాపురం వద్ద అనంత తాగునీటి పథకాన్ని రూపొందించారు.

హంద్రీ–నీవాతో సాగునీటి పరిష్కారం
కరువు రక్కసిని తరిమికొట్టే లక్ష్యంతో రూ.6,850 కోట్లతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఫేజ్‌–1 కింద 1.98 లక్షలు, రెండో దశ కింద రూ.4.04 లక్షలు మొత్తం 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లు 310 గ్రామాల్లోని 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడం ఈ పథకం ఉద్దేశం. వైఎస్‌ హయాంలో రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. 2012లోనే కష్జాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. ఈ జలాల్లో ‘అనంత’ వాసులు ఇటీవల కష్ణా పుష్కరస్నానం కూడా చేశారు. నాలుగేళ్లుగా నీళ్లొస్తున్నా ఆయకట్టుకు నీరివ్వలేని దుస్థితిలో ఇప్పటి ప్రభుత్వాలు ఉన్నాయని, ఈ నీటిని సాగుకు ఉపయోగిస్తే బంగారు పంటలు పండుతాయని స్నానానికి వచ్చినవారు చర్చించుకున్నారు.

పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా..
వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ‘అనంత’లో పారిశ్రామిక రంగాన్ని కూడా సమాంతరంగా అభివద్ధి చేయాలని సంకల్పించారు. దీంతోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ఒడిస్సీ సంస్థతో సైన్సు సిటీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివద్ధికి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటుచేశారు. తర్వాతి  ప్రభుత్వం తీరుతో సైన్సు సిటీ ఏర్పాటు ఒప్పందాన్ని ఒడిస్సీ సంస్థ రద్దు చేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో బీడీఎల్‌(భారత్‌ దైనిక్స్‌ లిమిటెడ్‌), హెచ్‌ఏఎల్‌(హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌), ఈసీఐఎల్‌(ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌), బీహెచ్‌ఈఎల్‌(భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌) వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో పరిశ్రమలకు నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్‌ నుంచి పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 25 శాతం ఈ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే తర్వాతి ప్రభుత్వాలు లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ భూముల ఒప్పందాలనే రద్దు చేశారు.


పంటలబీమాతో రైతుకు దన్ను
 2003 వరకూ రైతులు వేరుశనగ సాగు చేయడం, నష్టపోవడం, ప్రభుత్వాలు ఆదుకోక ఆత్మహత్యలకు తెగించడం జరిగింది. 2004 నుంచి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా రైతులకు పూర్తి దన్నుగా నిలిచారు వైఎస్‌. ఏటా 600–1,000 కోట్ల మేర ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ రైతులకు అందజేశారు. ‘వేరుశనగ కాయలు కాయకపోయినా మా వైఎస్‌ డబ్బులు కాయిస్తాడు’ అనేలా రైతులు ధైర్యంగా పంట సాగు చేసేవారు.

2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. దీని వల్ల ఆ ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు రూ.600 కోట్ల పరిహారం దక్కింది ఇలా చేనేతలు, రైతుల శ్రేయస్సుతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఉచిత విద్యుత్‌...ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన  వైఎస్‌ సరిగా ఏడేళ్ల  కిందట ఇదే రోజు కర్నూలు జిల్లాలో పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్‌ ప్రమాదంలో మత్యువాత పడ్డారు. ఆయన భౌతికంగా దూరమైనా ‘అనంత’ గుండెల్లో దేవుడిగా కొలువున్నారు. రాష్ట్రచరిత్రలో నిజమైన లీడర్‌గా నిలిచారు.

మరిన్ని వార్తలు