వైఎస్ హయాంలోనే సింగూరు కాల్వలకు నిధులు

9 Dec, 2016 22:42 IST|Sakshi
వైఎస్ హయాంలోనే సింగూరు కాల్వలకు నిధులు

సింగూరు జలాల కోసం పోరాడింది కాంగ్రెస్సే
దివంగత నేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే నిధులు
అందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు

జోగిపేట : దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రూ.89.98 కోట్లను సింగూరు ప్రాజక్టు కాల్వల నిర్మాణానికి మంజూరు చేశారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పి.నారాయణ, పద్మనాభరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన  సమావేశంలో వారు మాట్లాడారు. దివంగత నేత పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో  జోగిపేటలో సింగూరు జలాల దీక్షా శిబిరాన్ని సందర్శించారని, అధికారంలోకి రాగానే ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాల సేద్యానికి కాల్వల ద్వారా నీటిని అందిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేసారన్నారు. సింగూరు నీటిని సేద్యానికి తామే ఇచ్చినట్లు టీఆర్‌ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రారంభోత్సవాల పార్టీయేనన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ నేతృత్వంలో 2003వ సంవత్సరంలో 102 రోజుల పాటు రిలే దీక్షలను చేపట్టారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేయకుంటే సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనను విభేదించిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్, మాజీ డిప్యూటీ సీఎం తల్లితో  ప్రారంభించారని అన్నారు. కాల్వల నిర్మాణం ఎవరి హయాంలో ప్రారంభమైందో ప్రజలకు తెలుసన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మీద అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు.

ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీయేనని, ఈ విషయాన్ని సీఎం కేసీఆరే అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని, తెచ్చేలా కృషి చేసింది దామోదర్ రాజనర్సింహ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అందోల్ మండల, పట్టణ అధ్యక్షులు బి.శివరాజ్, సత్తయ్య, మాజీ ఎంపీటీసీలు సురేందర్‌గౌడ్, ఏ.చిట్టిబాబు, రాజిరెడ్డి, రారుుని కృష్ణయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు అర్పత్ మొహియొద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు శేరి సంగారెడ్డి, మహేష్‌గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, డి.అశోక్, గణేష్, సర్పంచ్ అశోక్, కౌన్సిలర్లు శరత్‌బాబు,  సునీల్‌కుమార్, మైనార్టీ నాయకులు అలీఅబ్బాస్, గోహేర్‌అలీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు