రన్‌వేపై నిర్బంధించడమేమిటి?

27 Jan, 2017 01:57 IST|Sakshi
రన్‌వేపై నిర్బంధించడమేమిటి?

విమానాశ్రయంలో పోలీసులను నిలదీసిన జగన్‌

సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులను ఇలా రన్‌వేపై అడ్డుకోవడమేమిటి? మీరసలు పోలీసులేనా? కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయప్రాంతంలోకి రాష్ట్రపోలీసులెలా వచ్చారు?.. విమానాశ్రయంలో తమను అడ్డుకున్న పోలీసులను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఆ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్లు నమిలారు. ఖాకీలను జగన్‌ నిలదీశారిలా....

‘‘ప్రయాణికుల ప్రయాణ మార్గంలో ఎందుకు పోనివ్వడం లేదు? మమ్మల్ని ఇక్కడ ఆపి ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ ఆపారు? మేం ఏంచేయాలిక్కడ? రన్‌వేపైనే ఆపడమేమిటి? వీళ్లు పోలీసులా? ఐడీ కార్డు కూడా లేదు? ఎవరసలు వీళ్లంతా?’’

‘‘ప్రయాణికుల మార్గం గుండా ఎప్పుడూ వీఐపీ లాంజ్‌లోకి వెళతాం. మమ్మల్ని వేరే మూలకు ఎందుకు తీసుకుపోతున్నారు. అది లాంజ్‌ కాదుకదా. నా వెంట వస్తున్నవారిలో ఇద్దరిని కిడ్నాప్‌ చేశారు మీరు. అందులో ఒకరు లోక్‌సభ సభ్యుడు కూడా. అసలు మీరు లోనికెందుకు వచ్చారు? రాష్ట్రపోలీసులు విమానాశ్రయంలోకి ఎలా వస్తారు? ఇది కేంద్ర బలగాలైన సీఐఎస్‌ఎఫ్‌ అధీనంలో ఉండే ప్రాంతం.’’ ‘‘ఎలా వ్యవహరించాలో తెలియకుండా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఎలా ఉన్నారు మీరంతా? డొమెస్టిక్‌ అరైవల్‌ అనే బోర్డు మీకు కనిపించడం లేదా? ప్రయాణికులను బైటకు పంపించరా? రన్‌వేపై మమ్మల్ని ఆపడమేమిటి? ఏం చేస్తున్నారో మీకు తెలుస్తున్నదా?’’‘‘రెండే రెండు సంవత్స రాలు. నేను ఎవరినీ మర్చిపోను. ఒక ప్రయాణికుడితో వ్యవహరించినట్లు కూడా వ్యవహరించరా? ఎందుకు ఆపుతున్నారు?’’