వైఎస్ఆర్ సదాస్మరామి

9 Jul, 2016 03:44 IST|Sakshi
వైఎస్ఆర్ సదాస్మరామి

జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
ఇడుపులపాయ ఘాట్‌లో నివాళు లర్పించిన వైఎస్ కుటుంబసభ్యులు
కడపలో రక్తదానం.. పలుచోట్ల అన్నదానాలు
వైఎస్‌ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన అభిమానులు
ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నేతలు
పాల్గొన్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మేయర్

 సాక్షి కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కాగా ఇడుపులపాయకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.  వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇడుపులపాయ గ్రామంలో  గ్రామస్తులు ఏర్పాటు చేసిన కేక్‌ను వైఎస్ జగన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కట్ చేసి పంచిపెట్టారు.

వాడ.. వాడలా వైఎస్ జయంతి వేడుకలు
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కుల,మత, వర్గ, బేధాలు లేకుండా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడపలోని హెడ్ పోస్టాఫీసు వద్ద వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పాలాభిషేకం చేశారు. అలాగే పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. చాపాడు, దువ్వూరు, మైదుకూరులలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. మైదుకూరులోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాయచోటిలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పూలమాలవేసి క్షీరాభిషేకం చేయడంతోపాటు పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చెర్మైన్ నసిబున్ ఖానం ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

రైల్వేకోడూరులోని టోల్‌గేట్ వద్ద వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మానందరెడ్డిలు పూలమాలలువేసి నివాళులర్పించారు. రాజంపేటలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ నాయకులు సుధాకర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పోలా శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. రాష్ట్ర నేతలు ఆకేపాటి మురళిరెడ్డి, చొప్ప యల్లారెడ్డి పాల్గొన్నారు. అన్నదానం చేశారు. బద్వేలు నియోజకవర్గంతోపాటు పోరుమామిళ్లలో వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్‌ఆర్ చిత్ర పటానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులర్పించారు. జమ్మలమడుగులో రాష్ట్ర నాయకులు హనుమంతురెడ్డి, శుద్దపల్లె శివుడు, పోరెడ్డి మహేశ్వరరెడ్డి, దన్నవాడ మహేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో చేయగా.. మైలవరం మండలం దన్నవాడలో రాష్ట్ర నాయకురాలు అల్లె ప్రభావతి, తాళ్లప్రొద్దుటూరులో సర్పంచ్ రామసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు.

ప్రొద్దుటూరులోని అన్వర్ థియేటర్ వద్ద వైఎస్‌ఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరు నాగేందర్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల ఝాన్సీరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మా శివచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కేక్‌ను కట్ చేశారు. కమలాపురంలో పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా.. అప్పాయపల్లెలోని అనాథ శరణాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతి సిమెంటు కర్మాగార ఆవరణంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ టి.సాయి రమేష్, అసిస్టెంటు వైస్ ప్రెసిడెంటు దత్తా, జనరల్ మేనేజర్ మధుసూదన్, మైన్స్ జీఎం నాగసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు