‘కందికుంట’ చెబితే టెండర్లు వాయిదా వేస్తారా..?

23 Feb, 2017 23:26 IST|Sakshi

– కమిషనర్‌ను నిలదీసిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
– మద్దతు పలికిన కొందరు టీడీపీ కౌన్సిలర్లు
– రాజకీయ ఒత్తిడితో కాదంటున్న కమిషనర్‌

కదిరి : ‘అధికార టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ చెతితే మీరు టెండర్లు వాయిదా వేస్తారా? టెండర్‌ కోసం కొందరు అప్పులు చేసి డబ్బు తీసుకొచ్చారు. వారందరినీ మీరు నిరాశ పరిచారు. ఆ నాయకుడి అనుచరులకు సమయానికి డబ్బు అందుబాటు కాకపోవడంతో ఆయన మీకు ఫోన్‌ చేయడం, టెండర్లు రద్దు చేయడం,  ఎంత వరకు కరెక్ట్‌? అసలు టెండర్‌ రద్దు చేసే అధికారం మీకెవరిచ్చారు? అంటూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌ పి.భానుప్రసాద్‌ను గురువారం నిలదీశారు.

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వీధులకు రెండు వైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారి దగ్గర గేట్‌ వసూలు చేసుకునేందుకు 22న బహిరంగ వేలం జరగాల్సి ఉండగా, దాన్ని 27కు, 23న జరగాల్సిన కూరగాయలు, జంతువధ బహిరంగ వేలాన్ని మార్చి 6కు వాయిదా వేస్తూ కమిషనర్‌ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కమిషనర్‌తో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సురయాభానును వారి వారి చాంబర్లలో వేర్వేరుగా కలసి నిలదీశారు.

ఎవరి ప్రయోజనాల కోసమో బహిరంగ వేలాన్ని వాయిదా వేయాల్సి వచ్చిం దని కడిగిపారేశారు. ఈ విషయంలో టీడీపీ కౌన్సిలర్లు కూడా కొందరు మద్దతు పలకడం విశేషం. టెండర్లు వాయిదా వేయడానికి తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని, కొన్ని టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే వాయిదా వేయాల్సి వచ్చిందని కమిషనర్‌ వారితో పేర్కొన్నారు. అనంతరం తమ అభ్యంతరాల గురించి కమిషనర్‌ను వినతిపత్రం రూపంలో అందజేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, జగన్, ఖాదర్‌బాషా, గంగాధర్, ఖలీల్, టీడీపీ కౌన్సిలర్లు శంకర్, కళ్యాణ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు