ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే

25 Feb, 2017 23:22 IST|Sakshi
ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే
మృతుడు రాంబాబు కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వాల్సిందే
వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌ 
పార్టీ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటన
రాజమహేంద్రవరం సిటీ : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటాలే  తప్ప ప్రభుత్వ సంక్షేమాన్ని విస్మరించిందని, దాని పర్యవసానమే పుష్కరఘాట్లో రాంబాబు మృతి ఘటన అని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. రాంబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గ్రేటర్‌ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, సిటీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శివరాత్రి పుణ్యస్నాన మాచరించేందుకు వచ్చిన రాంబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే మృత్యువాత పడ్డాడన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. మృతుడి కుటుంబానికి రెండు ఎకరాల పంటభూమి, రూ.50 వేల సహాయం అందజేయాలన్నారు. భర్తను కోల్పోయిన బాధితురాలు న్యాయం కోసం రోడ్డెక్కితే ఆమెపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమన్నారు. గ్రేటర్‌ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ విద్యుదాఘాతానికి గురైన రాంబాబుకు వెంటనే చికిత్స అందించి ఉంటే బతికేవాడన్నారు. రెండు గంటల పాటు నరక యాతన అనుభవించాడని, పుష్కరఘాట్‌లో కనీసం ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 108 రావడానికి రెండు గంటలపైనే పట్టిందన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 28 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పుష్కరాలు నిదర్శనమన్నారు. శివరాత్రి సమయంలో సైతం అదే తప్పిదం బయట పడిందన్నారు. కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్‌ పోలు విజయలక్ష్మి, సేవాదల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం సహాయ కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకే సురేష్, చిక్కాల బాబులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు