పేదలంటే అంత చులకనా..

13 Feb, 2017 23:02 IST|Sakshi
పేదలంటే అంత చులకనా..
- ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
- గైనకాలజిస్ట్‌ తీరుపై తీవ్ర నిరసన
- ప్రసూతి సేవలపై వైఎస్సార్‌ సీపీ ఆధర్యంలో ధర్నా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పేదలంటే అంతచులకనా..వారి దయనీయ పరిస్థితి చూసి జాలికలగదా.. ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం సురక్షితమంటు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదా? తీరా ఆస్పత్రికి వస్తే  హీనాతిహీనంగా చూడడం..ఇదేనా మీ తీరు అంటూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ధర్నాలో పలువురు వైద్యులు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో రోగులతో వైద్యులు ప్రవర్తిస్తున్న విధానంపై వైఎస్సార్‌ సీపీ ఆస్పత్రి అ«ధికారులను ప్రశ్నిస్తోంది. ఎటువంటి చర్యలు లేకపోవడంతో సోమవారం ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో గర్భిణులు పడుతున్న అవస్థలు ప్రత్యక్షంగా చూశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రసవానికి వస్తున్న వారితో గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ విష్ణువర్థిని అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ గైనకాలజీ విభాగంలో జరుగుతున్న తంతుపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతిని«ధి మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ గర్భిణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న డాక్టర్‌ విష్ణువర్థినిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. వైద్యులు అందించాల్సిన సేవలను సిబ్బందితో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.   వెంటనే సిబ్బంది కొరత నివారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మశ్రీకి వినతిపత్రం అందించారు. ఆమె స్పందిస్తూ జరిగిన పరిణామాలపై విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ‘నేనురాను బిడ్డో ఈ సర్కారు «దవాఖానకు’ అనే నృత్యం రూపకం అందరినీ ఆకట్టుకుంది. పార్టీ నాయకులు కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజు, మిందే నాగేంద్ర, గుత్తుల మురళీధరరావు, బొంతా శ్రీహరి, కొల్లి నిర్మల, మార్త లక్ష్మి, నరవా గోపాలకృష్ణ, పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సుంకర చిన్ని, గుర్రం గౌతమ్, దంగేటి వీరబాబు, తోరాడ ప్రభు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు