రెండేళ్ల బాబు పాలన ఘోరం

18 Jul, 2016 12:13 IST|Sakshi
రెండేళ్ల బాబు పాలన ఘోరం

విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతోందని, రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయినట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వాఖ్యానిం చారు. ఇవేమీ తాము చెప్పడంలేదని, తాము గడచిన పది రోజులుగా చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో జనమే చెబుతున్నారని అన్నారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా, ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా కేవలం ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు బాధ్యతగల ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తలపెట్టారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న తమ వద్దకు వచ్చి సమస్యలు మొరపెట్టుకోవటం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్నరాజ్యంకోసం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గమని తెలిపారు.

నిరంతర ప్రజాహిత కార్యక్రమాలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే గాకుండా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాజన్నరాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో నెలకొందన్నారు. పార్టీ జెండా తో గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నట్లు కోలగట్ల తెలిపారు. తాము చేసిన తప్పుకు భవిష్యత్తు ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్న భయంతో ఉన్నారని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారినా అక్కడ గడపగడపకు వైఎస్సార్ విజయవంతంగా జరుగుతోందని, రానున్న రెండునెలల్లో ఆ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామనీ తెలిపా రు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన గడప గడపకు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. పార్టీ నాయకులు 100 ప్రశ్నల ప్రజాబ్యాలెట్‌తో ప్రజల్లోకి వెళుతుంటే వారు బ్రహ్మరధం పడుతున్నారన్నారు.

పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్‌మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు ఇటుకలు.. రెం డు ఇసుక బస్తాలతో శంకుస్థాపన చేసి పదవి కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం అనంతర ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే అదేదో తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. సమావేశంలో ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు