ప్రభుత్వ వైఖరివల్లే ‘కాల్‌మనీ’ మాఫియా

14 Dec, 2015 02:17 IST|Sakshi
ప్రభుత్వ వైఖరివల్లే ‘కాల్‌మనీ’ మాఫియా

వైఎస్సార్‌సీపీ నేత  కె.పార్థసారథి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: పేదప్రజలు, మహిళల పరువు ప్రతిష్టలతో చెలగాటమాడే ‘కాల్‌మనీ’ వంటి వ్యవహారాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం వైఖరి వల్లనే రాష్ట్రంలో మాఫియా వ్యవహారాలు చెలరేగిపోతున్నాయన్నారు. ఆయన ఆదివారమిక్కడ పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆయన వైఖరివల్ల విజయవాడ-అమరావతి మాఫియా జలగల చేతుల్లో చిక్కుకుపోతున్నదనేది అందరూ గమనించాలన్నారు. తెలుగు ప్రజలకు అందరూ మెచ్చే రాజధాని కావాలని, అవలక్షణాల రాజధాని కాదన్నారు. ‘కాల్‌మనీ’ వ్యవహారం వెనుక తెలుగు తమ్ముళ్లున్నారంటూ వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను పార్థసారథి చూపిస్తూ ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహ రించి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కామాంతకులెవరో పోలీసులు తేల్చాలన్నారు.

 డ్వాక్రామహిళల రుణాల్ని మాఫీ చేస్తానని అబద్ధపు హామీఇచ్చి అధికారంలోకొచ్చాక మాట తప్పినందునే అప్పులఊబిలో ఈ సంఘాలన్నీ కూరుకుపోయాయని, దాని ఫలితంగానే వాటిలోని మహిళలు విజయవాడలో ‘కాల్‌మనీ’ మాఫియా ఊబిలో చిక్కుకున్నారని పార్థసారథి అన్నారు.

 ఈశ్వరిపై హత్యాయత్నం కేసా!
 చింతపల్లి బాక్సైట్ వ్యతిరేక సభలో గిరిజనుల మనోభావాలు ప్రతిబింబించేలా మాట్లాడినందుకుగాను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై హత్యాయత్నం(307) కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని చూడటం దారుణమని పార్థసారథి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. విపక్ష నేత జగన్‌ను తోలుతీస్తానని మాట్లాడితే ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోరా? చంద్రబాబు కనీసం మందలించలేదెందుకు? అని ప్రశ్నించారు. బోడే ప్రసాద్ అనే ఎమ్మెల్యే ‘అక్రమ కట్టడాల పేరు’తో లక్షల సొమ్మును బాహాటంగా  వసూలుచేస్తూంటే, మరో ఎమ్మెల్యే డీడీలద్వారా లంచాలు తీసుకుంటానని చెబుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు