పెరిగిన ధరలు, ఎండిన పంటలపై చర్చేది?

4 Nov, 2015 01:22 IST|Sakshi
పెరిగిన ధరలు, ఎండిన పంటలపై చర్చేది?

♦ భూములు దోచిపెట్టడంపైనే కేబినెట్‌లో చర్చించారు
♦ భూముల లీజును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గం
♦ వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: సాగునీరందక ఒకపక్క ఎండుతున్న పంటలు.. మరోవైపు సామాన్యుడు ఊహించనంత స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల.. రాష్ట్రమంతటా కరువుతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై కనీసం చర్చ చేపట్టకపోవడాన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ పాలనా విధానమేంటో తెలిసిపోతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేబినెట్‌లో ఎలాంటి చర్చ జరగకుండానే చాపచుట్టేశారు.

ధరలపై సమగ్ర చర్చే లేదు. రైతుల సమస్యలపైనా చర్చలేదు.  అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా శకం ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్రానికి జరగబోయే అన్యాయంపై కనీసం చర్చ జరపలేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురుచూస్తుంటే.. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై చర్చలేదు. రైతులనుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి సంబంధించిన భూముల లీజులపై మాత్రం నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె తూర్పారబట్టారు. ప్రభుత్వ భూముల లీజు విషయంలో 33 ఏళ్లే సుదీర్ఘ గడువుగా భావిస్తుంటే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ గడువును 99 ఏళ్లకు పెంచడం అత్యంత దుర్మార్గమని పద్మ దుయ్యబట్టారు.

భూమిలేని నిరుపేద రైతులు ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటామంటే పారిశ్రామికవేత్తల మాదిరి గా వారికీ 99 ఏళ్లపాటు లీజుకిస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో అందరికీ తెలిసిన విషయమేనని, సీఎం, మంత్రులకూ ఇది తెలిసినా.. ఏమీ తెలి యనట్టు అక్రమ రవాణా నివారణకు రూ.18 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాననడం మరో అవినీతికి పాల్పడడానికేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత రూ.100 కోట్లు ఇస్తామనడం అందరినీ మోసం చేసినట్టుగానే.. వారినీ మోసం చేయడమేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంతకాలం తరువాత కాపుల రిజర్వేషన్ల అంశం సర్కారుకు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా